విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ 

13 Jan, 2022 04:23 IST|Sakshi
సదస్సులో పాల్గొని అభివాదం చేస్తున్న పోరాట వేదిక నాయకులు

ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక తీర్మానం 

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా విశాల ఉద్యమం నిర్మించాలని సదస్సు పిలుపునిచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో విస్తృతంగా సంతకాలు సేకరించి బడ్జెట్‌ సమావేశాల నాటికి  పార్లమెంటుకు కోటి సంతకాలు పంపాలని సదస్సు తీర్మానించింది.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా కోటి సంతకాల సేకరణ, జిల్లా వ్యాప్త సదస్సులు, భవిష్యత్‌ కార్యక్రమాలు రూపొందించాలని సదస్సులో తీర్మానించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు కె.ఎం. శ్రీనివాస్, ఆదినారాయణ మాట్లాడారు. ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కె.పోలారి (ఇఫ్టూ), నరహరశెట్టి నరసింహారావు, పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు పి.అజయ్‌కుమార్, ఎం.వి.సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు