కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకోలేం

19 Apr, 2022 03:50 IST|Sakshi

ఆ స్థలంలో నిర్మాణాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయి

స్పష్టం చేసిన హైకోర్టు.. విచారణ వాయిదా

సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎంఎస్‌ నాయకర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌కు చెందిన 4.41 ఎకరాల భూమిని వైఎస్సార్‌సీపీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం కేటాయించేందుకు కలెక్టర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ 4.41 ఎకరాల భూమిలో చేపట్టే నిర్మాణాలు ఈ వ్యాజ్యంలో తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేటాయింపుపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటిని కొట్టేయాలని కోరుతూ జనసేన పార్టీ కార్యకర్త బాతుల గణేష్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. రెవెన్యూ రికార్డుల్లో ఆ 4.41 ఎకరాల భూమి బండి బాటగా ఉందని చెప్పారు.

అలాంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తెలిపారు. ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా చెట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత దశలో నిర్మాణాలను నిలువరిస్తూ ఎలాంటిæ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమన్న ధర్మాసనం, ఆ భూమిలో చేపట్టే నిర్మాణాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని పేర్కొంది.  

మరిన్ని వార్తలు