Collector Nagalakshmi Selvarajan: ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి

26 May, 2022 19:43 IST|Sakshi
గుమ్మఘట్ట మండలం అడిగుప్ప వద్ద కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం (రాయదుర్గం/టౌన్‌) : ‘ఏమ్మా.. అంతా బాగున్నారా? ఉదయమే వచ్చేశాను. మీరు తెచ్చుకున్న క్యారీ ఉందా? ఉంటే నాకూ కాస్త అన్నం పెట్టండి’ అంటూ జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ కూలీలతో   ఆప్యాయంగా మాట్లాడారు. బుధవారం ఆమె రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో పర్యటించారు. రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల, నాగిరెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మమేకమై..వారి సమస్యలను తెలుసుకున్నారు. వేపరాళ్ల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. 

రాయదుర్గంలోని బీటీపీ, ముత్తరాసి లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను పరిశీలించి..పురోగతిపై ఆరా తీశారు. తర్వాత గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం, అడిగుప్ప గ్రామాల పరిధిలో ఉపాధి పనులను పరిశీలించారు. శిరిగెదొడ్డి గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో కూలీలతో మాట్లాడుతూ రూ.250 దినసరి కూలి అందేలా పనులు చేసుకోవాలని సూచించారు. ప్రతి పనీ నాణ్యతగా ఉండాలన్నారు. వేపరాళ్లలో రెండు వారాల వేతనం అందలేదని కూలీలు తెలపగా.. సత్వరమే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రోజూ రెండు లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మే 14 వరకు ఉన్న వేతనాలన్నీ జమ చేశామని, ఒకట్రెండు రోజుల్లో మిగిలినవీ చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కూలీలకు లేబర్‌ కార్డులు పంపిణీ చేశారు. సచివాలయాల్లో పౌర సేవలు మరింత మెరుగ్గా అందివ్వాలని సిబ్బందిని ఆదేశించారు. వి«ధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ, ఆర్బీకే భవన నిర్మాణాలను పరిశీలించి.. పురోగతిపై డీఈ రామమోహన్‌రెడ్డితో ఆరా తీశారు.  

నెలాఖరులోపు గ్రౌండింగ్‌ చేయాలి.. 
జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను నెలాఖరులోపరు గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడు నెలాఖరులోగా కచ్చితంగా నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత హౌసింగ్, మున్సిపల్, సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కలెక్టర్‌ వెంట డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి, ఏపీడీ శంకర్, తహసీల్దార్‌ మారుతి, ఎంపీడీఓ కొండన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు