ఒకే చోట 15 ఏళ్ల సర్వీసా..!

21 Apr, 2022 23:01 IST|Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: సమగ్రశిక్ష అభియాన్‌ జిల్లా కార్యాలయంలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఏఓ)గా ఓ వ్యక్తి 14 ఏళ్లుదాటి పనిచేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒకే పోస్టులో ఇన్నేళ్లపాటు రిలీవింగ్, బదిలీ ఉత్తర్వులు లేకుండా పనిచేస్తున్న ఉదంతంపై కలెక్టర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే సంబంధిత ఎఫ్‌ఏఓ పోస్టుకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేయాలని సమగ్రశిక్ష అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కవిటి మోహనరావు మాతృశాఖ ఖజానా శాఖ. సంబంధిత మాతృశాఖ నుంచి రిలీవింగ్‌ ఆర్డర్‌ లేకుండా, సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టరేట్‌ నుంచి బదిలీ ఉత్తర్వులు లేకుండా 2008లో అప్పటి రాజీవ్‌ విద్యామిషన్‌ (ప్రస్తుతం సమగ్రశిక్షగా పేరు మార్చారు)లో అకౌంటెంట్‌గా విధుల్లో చేరారు.

8 ఏళ్లు పనిచేసిన తర్వాత అదే శాఖలో 2015 డిసెంబర్‌ 23 నుంచి (మధ్యలో కొన్ని నెలలు విధులకు దూరంగా ఉన్నారు) ఇప్పటి వరకు ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల  వ్యక్తిగత అవసరాల కోసం సెలవులు మంజూరు చేయమని ఏపీసీ జయప్రకాష్‌ను కోరడంతో రచ్చ మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని రోజులు కుదరదని, ఖజనాశాఖ నుంచి రిలీవింగ్‌ లెటర్‌ చూపించాలని, లేదా స్టేట్‌ సమగ్రశిక్ష ఆఫీస్‌ నుంచి బదిలీ ఉత్తర్వులైనా చూపించాలని కోరగా, అవేవీ తన వద్ద లేవని మోహనరావు బదులివ్వడంతో ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఏపీసీ నివేదించినట్లు తెలిసింది.  ఈ ఉదంతంపై కలెక్టర్‌తోపాటు స్టేట్‌ సమగ్రశిక్ష ఎస్‌పీడీ వెట్రిసెల్వీ ఆరా తీసి ఫైల్‌ సిద్ధంచేయాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌ శాఖాపరంగా తీసుకున్న కార్యాలయం మార్పు, నిర్ణీత గడువుకు ముందే సెక్టోరియల్‌ అధికారుల తొలగింపు, కొత్త నోటిఫికేషన్‌ తదితర నిర్ణయాలను తప్పుపడుతూ ఎఫ్‌ఏవో సైతం ఏపీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ రెండు ఉదంతాలపై పూర్తి నివేదిక అందజేయాలని డీఈఓను కలెక్టర్‌ ఆదేశించారు. విచారణాధికారిగా సైతం నియమించారు.

మరిన్ని వార్తలు