ఆకస్మికంగా వచ్చి.. ఆవేదన తెలుసుకుని

25 Jul, 2021 11:29 IST|Sakshi

వంగర: శనివారం రాత్రి 9.20 గంటలు. ఎం.సీతారాంపురం నిశ్శబ్దంగా ఉంది. ప్రజలంతా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో గ్రామంలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కాన్వాయ్‌ వచ్చి ఆగడంతో ఏమై ఉంటుందోనని అంతా గుమిగూడడం మొదలుపెట్టారు. అంతలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ కారు దిగడంతో అంతా ఆశ్చర్యపోయారు. జిల్లా కేంద్రంలో రాత్రి పొద్దుపోయే వరకు వరుస సమావేశాలతో బిజీగా గడిపిన కలెక్టర్‌ పల్లె నిద్ర చేయాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఎం. సీతారాంపురం గ్రామాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా శ్రీకాకుళం నుంచి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహానికి వచ్చారు.

తహసీల్దార్‌ డి.ఐజాక్‌ అప్పటికప్పుడు చేరుకుని కలెక్టర్‌ ను స్వాగతించారు. సమాచారం అందుకున్న మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ బొత్స జయ ప్రకాష్, ఎంపీడీఓ డొంక త్రినాథ్, డీఎస్పీ శ్రావణి కూడా అక్కడకు చేరుకున్నారు. కలెక్టర్‌ రాకను తెలుసుకు న్న కొందరు అధికారులు శ్రీకాకుళం, రాజాం, పా లకొండ నుంచి వాహనాలపై హడావుడిగా ఎం. సీతారాంపురం చేరుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్‌ కళావతి ఆధ్వర్యంలో స్థానికులు వచ్చి కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు.

►ప్రధానంగా తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. స్థానికుల ఆవేద న చూసి కలెక్టర్‌ చలించిపోయారు. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

►సచివాలయ వ్యవస్థ, ఉద్యోగుల సేవలపై ఆరా తీయగా.. కొందరు సమయపాలన పాటించడం లేదని, ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని బదులిచ్చారు. 
 ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా.. అన్నీ బాగున్నాయన్నారు. వైద్య సిబ్బంది సేవలపై కూడా జనం సంతృప్తి వ్యక్తం చేశారు.  

►వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉత్తరావెల్లి సురేష్‌ ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు తోటపల్లి కుడి ప్రధాన కాలువలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాలని కోరగా.. నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్‌ చెప్పారు. కిమ్మి–రుషింగి వంతెన పనులు పూర్తి చేయాలన్నారు. 

► వంగరలో సచివాలయ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని సర్పంచ్‌ ప్రతినిధి కనగల పారినాయుడు కోరారు. ఎం.సీతారాంపురానికి ఆధార్‌ కేంద్రం మంజూరు చేయాలని స్థానికులు కోరా రు. అనంతరం అక్కడే రాత్రి భోజనం చేశారు. బొత్స ప్రవీణ్‌కుమార్‌ అనే సచివాలయ ఉద్యోగి తన ఇంటి నుంచి సామగ్రిని తీసుకువచ్చి కలెక్టర్‌ నిద్రకు హాస్టల్‌లోని ఓ గదిని సిద్ధం చేశారు.11 గంటలకు ఆయన నిద్రకు ఉపక్రమించారు.   

గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌

నిద్రకు ఉపక్రమిస్తున్న కలెక్టర్‌ 

మరిన్ని వార్తలు