AP: ప్రాణం నిలిపిన కలెక్టర్‌

3 Jan, 2022 14:13 IST|Sakshi

ఆర్డీఓ వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడి తరలింపు

సకాలంలో వైద్యసేవలు అందడంతో సేఫ్‌  

నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి కాపాడారు. సకాలంలో స్పందించి సదరు వ్యక్తిని ఆర్డీఓ వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్క డి వైద్యులు వెంటనే అత్యవసర వైద్యం అందించడంతో గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. కలెక్టర్‌గా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న సూర్యకుమారి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి, తన మానవత్వాన్ని చాటుకు న్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల్లోకి వెళ్తే.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి వేణుగోపాలపురం కాలనీకి చెందిన బి.అప్పారావు(30) శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై నెల్లిమర్ల నుంచి గాజులరేగ వెళ్తుండగా జేఎన్‌టీయూ జంక్షన్‌లో ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో కలెక్టర్‌ సూర్యకుమారి చీపురుపల్లిలో పింఛన్ల పంపిణీకి వెళ్లి తిరిగి విజయనగరం విచ్చేస్తున్నారు. రోడ్డు పక్కన రక్తపు మడుగులో వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కారును ఆపి 108 వాహనంలో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఫోన్‌ చేశారు. అయితే 108 వచ్చేందుకు కొంత ఆలస్యమవుతుందని గుర్తించి, తన వెనకే వస్తున్న ఆర్డీఓ భవానీశంకర్‌ అధికారిక వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.  

డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాగభూషణరావుకు విషయం తెలియజేసి, అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఆ సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న డీసీహెచ్‌ఎస్‌ ఇతర వైద్యులను అప్రమత్తం చేశారు. గాయపడిన వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యమందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నానికి గాయపడిన అప్పారావు అపస్మారక స్థితి నుంచి బయటపడినట్లు కలెక్టర్‌కు డీసీహెచ్‌ఎస్‌ తెలిపారు. గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రికి తీసుకురావడం వల్లనే ప్రాణాలు కాపాడగలిగామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కలెక్టర్‌ చొరవను అధికారులతో పాటు వైద్య సిబ్బంది అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు