క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం‌: కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

12 Aug, 2020 17:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: క్రేన్ నిర్మాణంలో లోపం కారణంగానే హిందూస్ధాన్ షిప్‌ యార్డులో క్రేన్ ప్రమాదానికి గురైందని విశాఖపట్నం కలెక్టర్ వినయ్‌ చంద్ అన్నారు. ఈ నెల 1న క్రేన్ ప్రమాదంలో చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది ‌మృతి చెందడంతో.. ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్‌ఈలతో కమిటీ నియమించామని తెలిపారు. ఆ కమిటీ బుధవారం షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను అందజేసిందని తెలిపారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి‌ నివేదిక అందించిందని పేర్కొన్నారు. క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం‌ స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల‌ లోడ్‌కి సంబంధించి క్రేన్‌ ట్రయల్‌ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో‌ స్పష్టం చేసిందన్నారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్‌ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు. (విశాఖ: షిప్‌ యార్డ్‌ ప్రమాదంపై నివేదిక)

గేర్ బాక్స్ ఫెయిల్యూర్‌ వల్ల భారీ శబ్దంతో క్రేన్ కుప్పకూలిందన్నారు. ప్రమాదం కేవలం పది సెకన్లలోనే జరిగిపోయిందని, క్రేన్ స్ట్రక్చరల్ డిజైనింగ్‌, డ్రాయింగ్స్ థర్డ్‌పార్టీతో పరిశీలించలేదని స్పష్టం చేశారు. క్రేన్ నిర్మాణంలోనే లోపాలున్నాయని, సామర్థ్యానికి తగ్గట్లుగా క్రేన్ నిర్మాణం జరగలేదని తెలిపారు. నిపుణులతోనే తప్పనిసరిగా లోడ్ టెస్టింగ్ పరిశీలన జరపాలన్నారు. థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని నిపుణులు సూచించారని తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం‌ చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు