AP: ఇక రోజూ బులెటిన్‌ బోర్డు

8 Sep, 2021 22:30 IST|Sakshi

గ్రామ/వార్డు సచివాలయాల్లో పెండింగ్‌ సమస్యల వివరాలు

ఏ అధికారి వద్ద సమస్య పెండింగ్‌లో ఉందో గుర్తించి పరిష్కారానికి చర్యలు 

బులెటిన్‌లో శాఖల వారీగా సమస్యల పరిష్కారం/ పెండింగ్‌ అర్జీల వివరాలు 

జాప్యం చేసిన అధికారులపై తగు చర్యలు 

అధికారుల్లో జవాబుదారీతనం కోసం గుంటూరు జిల్లాలో కొత్త పంథాకు శ్రీకారం 

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలకు వారి చెంతనే అన్ని రకాల సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యంత్రాంగం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎన్ని ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది.

ఏదైనా సమస్యను గడువులోగా పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు.. ఎవరి వద్ద పెండింగ్‌ ఉంది.. పెండింగ్‌లో ఉండడానికి కారణం.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ బులెటిన్‌ బోర్డుకు శ్రీకారం చుట్టారు. వార్డు/గ్రామ సచివాలయాలు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేందుకే దీన్ని ప్రవేశపెట్టారు.

ఇందులో భాగంగా సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్‌ అంశాలపై రోజూ బులెటిన్‌ జారీ చేస్తారు. ఇందులో పేర్కొన్న సమస్య ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో గుర్తించి.. సంబంధిత అధికారికి పరిష్కారం కోసం పంపుతారు. గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా పెండింగ్‌ సమస్యలకు సంబంధించిన బులెటిన్‌ను అధికారులకు పంపిస్తారు.  

నిర్దేశిత గడువులోగా పరిష్కరించకపోతే చర్యలు 
నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించనివారిపై చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బులెటిన్‌లో తహసీల్దార్‌కు వచ్చిన మొత్తం అర్జీల సంఖ్య, పరిష్కరించిన అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువులోపు ఉన్న అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువు దాటిన అర్జీల సంఖ్య, 24 గంటలు, 48 గంటలలోపు పరిష్కరించాల్సినవి ఉంటాయి.

బులెటిన్‌ను ఆరు కేటగిరీలుగా విభజించారు. మండల రెవెన్యూ అధికారి (రెవెన్యూ), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (విద్యుత్‌), మండల రెవెన్యూ అధికారి, డిప్యూటీ తహసీల్దార్‌ (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలు) సబ్‌ రిజిస్ట్రార్‌ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (రవాణా, రోడ్లు, భవనాలు) కేటగిరీలుగా విభజించి.. ఎందులో ఎన్ని అర్జీలు వచ్చింది పొందుపరుస్తారు. 

జవాబుదారీతనం కోసమే..  
గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట గడువులోగా సేవలు అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు బులెటిన్‌ బోర్డుకు శ్రీకారం చుట్టాం. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. 
– వివేక్‌యాదవ్, కలెక్టర్, గుంటూరు జిల్లా 

>
మరిన్ని వార్తలు