ఒక్కరోజులోనే ‘సీఎం’ సాయం 

28 Apr, 2023 04:07 IST|Sakshi

ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్‌  

ఓ దివ్యాంగుడికి ఉద్యోగమిస్తూ నియామక పత్రం అందజేత 

నార్పలలో తనను కలిసిన బాధితులపై సర్కారు ఔదార్యం  

అనంతపురం అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తారనేదానికి.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఆదుకుంటారనడానికి బుధవారం జరిగిన సంఘటనే ఉదాహరణ. తాజాగా.. ఈనెల 26న అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా నార్పలకు విచ్చేసిన సీఎంను వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న పలువురు నేరుగా ఆయన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వారి కష్టాలను విన్న ఆయన చలించిపోయారు.

ఆదుకునే విషయంపై అప్పటికప్పుడు కలెక్టర్‌ గౌతమికి ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల మేరకు బాధితులతో కలెక్టర్‌ మాట్లాడి అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆమె బాధితులకు చెక్‌లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ గాయత్రిదేవి, పరిపాలనాధికారి విజయలక్ష్మి, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర ఉన్నారు. 

♦ ఇటీవల జరిగిన కెమికల్‌ బ్లాస్ట్‌లో భర్తను కోల్పోయానని అనంతపురం ఎ.నారాయణపురానికి చెందిన చాకలి నవ్య సీఎంకు తెలిపారు. ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఆమె కుటుంబానికి కలెక్టర్‌ రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. 
♦ నార్పలకు చెందిన యోగీశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కుమారులతో తనకు కుటుంబపోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఆమె కుటుంబానికి రూ.2 లక్షలు సాయం అందించారు. 
♦ నార్పలకు చెందిన రామాంజి విద్యుత్‌ శాఖలో బిల్‌ రీడర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై కుడిచేయి కోల్పోయాడు. ఆయనకు రూ.2 లక్షలతో పాటు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇచ్చారు. 
♦ తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నార్పలకు చెందిన గంగయ్య సీఎంకు విన్నవించాడు. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం, వీల్‌ చైర్‌ అందజేశారు. 
♦ అనంతపురం ఎ.నారాయణపురానికి చెందిన రాజు, అరుణ కుమారుడు ధనుష్‌ జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నాడు. వీరు తమ బిడ్డ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అదే విధంగా ధనుష్కు అవసరమైన 
వైద్య చికిత్సలు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వి. అమర్‌నాథ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. ఆ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. 
♦ తన మేనల్లుడు చేతన్‌రెడ్డి కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన కొండారెడ్డి సీఎంకు తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
♦ నార్పల మండలం సిద్ధరాచెర్లకు చెందిన రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగ వైకల్యంతో  బాధపడుతున్నాడు. ఆమె కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం, వీల్‌ చైర్‌ అందజేశారు. 
♦ అనంతపురానికి చెందిన నారాయణమ్మ కుమారుడు జశ్వంత్‌రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆమె కుటుంబానికి 
రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. 
♦ దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల సైకిల్‌ ఇవ్వాలని నార్పలకు చెందిన నబిరసూల్‌ సీఎంకు విన్నవించాడు. ఆయనకు ట్రై సైకిల్‌ను అందజేశారు. 

మరిన్ని వార్తలు