చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న కలెక్టర్లు

29 Aug, 2020 17:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘‘హనీ ట్రాప్‌.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’’ పేరుతో ఓ దినపత్రిక ప్రచురించిన నిరాధార వార్తా కథనంపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ల వ్యవస్థపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లంతా కలిసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వార్తా కథనం ప్రచురించిన వారిని కోర్టుకు ఈడ్చాలని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా ఏపీలో ఏపీ కలెక్టర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా తయారైంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

అంతేగాక కరోనా లాంటి విపత్కర సమయంలో ఈ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నారు. అర్హులకు వీటిని అందించడంలో, అవినీతిలేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కలెక్టర్లందరికీ కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చింది. అలాంటి వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతో, కలెక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కథనాలను వండివారస్తున్నారని కలెక్టర్లు మండిపడుతున్నారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ నడుస్తోందని, దీని వల్ల తమ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి అసత్య కథనాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని పిల్లలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు ఇన్ని గంటలు కష్టించి పనిచేస్తున్నా.. తమపై ఈ రాతపూర్వక దాడి ప్రేరేపిత చర్య అని, ఆధారాలు లేకుండా, అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు వండి ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయమన్నారు. పరిధులు దాటి, విశృంఖల కోణంలో ఈ కథనాలున్నాయి. కలెక్టర్లను మానసికంగా దెబ్బతీసి కొందరికి ఇతోధిక ప్రయోజనాలు కల్పించాలన్న కోణం ఇందులో కనిపిస్తోంది. వీటిని చూస్తూ ఊరుకుంటే... కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేయలేరు. అందుకే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు