వినీలాకాశంలో నియో వైస్‌ కనువిందు

30 Jul, 2020 07:06 IST|Sakshi
సింహాచలం కొండకు నార్త్‌ఈస్ట్‌లో కనిపించిన తోకచుక్క కామెట్‌ నియోవైస్‌ (సర్కిల్‌లో)-(ఇన్‌సెట్‌లో) తోకచుక్కను కెమెరాలో బంధించిన విశ్వ భవ్య 

అల్లిపురం (విశాఖ దక్షిణం): వినీలాకాశంలో కొత్త అతిథి సందడి చేస్తోంది. దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం నాటి దుమ్ము, ధూళితో నిండిన “కామెట్‌ నియోవైస్‌’ తోకచుక్క భూమి ఉత్తర ధృవప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తోంది. ఈ తోకచుక్కను మార్చిలో నాసాకు చెందిన నియోవైస్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ గుర్తించింది. అత్యంత అరుదైన ఈ తోకచుక్కను నగరానికి చెందిన హెచ్‌బీ కాలనీ భానునగర్‌కు చెందిన మొదిలి వైష్ణవి భవ్య తన కెమెరాలో ఇటీవల బంధించారు. రోజూ సూర్యాస్తమయం వేళ దర్శనమిచ్చే ఈ తోకచుక్కను తన కెమెరా(కెనాన్‌ ఈవోఎస్‌ 600 డీ)లో బంధించేందుకు సింహాచలం కొండకు ఉత్తరం వైపున ఉన్న భైరవస్వామి ఆలయం వద్దకు ఆమె వెళ్లేవారు.

రోజూ గంటల కొద్ది వేచి ఉన్నా వాతావరణంలో ధూళి కణాల వల్ల తోకచుక్క కెమెరాకు చిక్కేది కాదు. రెండు రోజులుగా ఎండలు బాగా కాయడంతో శొంఠ్యాం రోడ్డులోని భైరవవాక వద్ద ఈ నెల 26వ తేదీ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తోటచుక్క భూమిని రాసుకుని వెళ్తుండగా భవ్య తన కెమెరాతో బంధించింది. క్షణాల్లో ఇలా కనిపించి మాయమైన తోకచుక్కను తన కెమెరాలో బంధించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు