మనబడి నాడు-నేడుపై కమాండ్‌ ఐ

1 Nov, 2022 16:49 IST|Sakshi

వడివడిగా రెండో దశ పనులు

పనుల పురోగతిపై కలెక్టర్‌ నిత్యం పర్యవేక్షణ

ప్రతి మంగళవారం ఎంఈఓలతో సమీక్ష

నిర్ణీత సమయంలో పూర్తికి ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పనులు మరింత పారదర్శకంగా, వేగంగా  పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో పలు పాఠశాలలను సుర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం రెండో విడతకు 979 స్కూళ్లను ఎంపిక చేసింది. ఇందులో 960 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి. పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది నిరంతరం పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించనున్నారు.

ఒంగోలు: జిల్లాలో మనబడి నాడు–నేడు పనులు వేగవంతమయ్యాయి. కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పనులు ఊపందుకున్నాయి. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీచేస్తూ కలెక్టర్‌ చర్యలు చేపట్టడంతో అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం పనుల్లో పురోగతిపై దృష్టి సారించారు. మొన్నటి వరకు 20వ స్థానంలో ఉన్న జిల్లా ఒక్కసారిగా 5వ స్థానానికి చేరుకుంది.  

960 గ్రౌండింగ్‌ పూర్తి 
జిల్లాలో నాడు–నేడు రెండో దశలో ఇప్పటికే 979 విద్యా సంస్థలకు 960 గ్రౌండింగ్‌ పూర్తయింది. వాటిలో అంగన్‌వాడీ సెంటర్లు,  డైట్‌ కాలేజీ,  ప్రాథమిక,  ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి.  జిల్లాలోని ఏపీఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ డిపార్టుమెంట్, రూరల్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ శానిటేషన్, సమగ్రశిక్ష అభియాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు ఈ పనులను పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం రూ.425 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా తొలుత 15 శాతం నిధులు విడుదల చేసింది. అంచనాలు రూపొందించడం, ఒప్పందాలు చేసుకోవడం, రివాల్వింగ్‌ ఫండ్‌ జమ చేయడం, పరిపాలన పరమైన అనుమతులు పొందడం చకచకా జరిగాయి. ఇప్పటి వరకు రూ.81 కోట్లకుపైగా ఖర్చు చేశారు. మొత్తం ప్రక్రియ ఇంకా ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. 

ఏపీఎంలకు దిశా నిర్దేశం
డలాల్లో నాడు–నేడు పనుల పర్యవేక్షణకు సంబంధించి సెర్ప్‌లోని ఏపీఎంలను జిల్లా విద్యాశాఖలో అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు కేటాయించారు. ఇప్పటికే వారికి కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. మొత్తం 37 మంది ఈ బాధ్యతలు నిర్వహించనుండగా వీరంతా ప్రస్తుతం బాపట్లలో శిక్షణ పొందుతున్నారు. వారు కూడా వస్తే పనులు మరింత వేగవంతం అవుతాయి. ఆరు నెలల లక్ష్యాని కన్నా ముందే నాడు–నేడు పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ జారీ చేస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నాం.  
– డీఈఓ బి.విజయభాస్కర్‌ 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు  
సమగ్రశిక్ష అభియాన్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఇందులో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు ప్రతి రోజు పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంటారు. ప్రధానంగా సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి సిమెంట్, ఇనుము, ఇసుకతో పాటు ఇతర ఫర్నిచర్‌ రాకపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.

పనుల్లో తలెత్తే సమస్యలను తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. కలెక్టర్‌ ప్రతి రోజు ఉదయాన్నే వాట్సాప్‌లో పనుల ప్రగతిని సమీక్షించడం, డీఈఓకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి మంగళవారం నేరుగా మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొక్కుబడి సమీక్షలు కాకుండా ప్రత్యేకంగా విద్యాశాఖపై కలెక్టర్‌ నేరుగా పర్యవేక్షిస్తుండడంతో దిగువ స్థాయిలో కూడా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులిచ్చారు.

మరిన్ని వార్తలు