బ్రహ్మోత్సవ సంబరం ప్రారంభం

18 Sep, 2023 04:38 IST|Sakshi

శాస్త్రోక్తం గా తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 

నేడు ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ 

తిరుమల/తిరుపతి క్రైం: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధి­పతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. 

నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం 
సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు.  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. 

వాహనాలకు పాసులు ఉంటేనే అనుమతి 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడ సేవ సందర్భంగా తిరుమలకు వచ్చే వాహనాలకు (ఫోర్‌వీలర్లకు) పాసులను టీటీడీ తప్పనిసరి చేసింది. దీంతో తిరుమల వెళ్లే ప్రతి వాహనదారుడు పాసులు పొందాల్సి ఉంటుంది. కాగా, గరుడ సేవ రోజు ద్విచక్రవాహనాలను తిరుమలకు అనుమతించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. 

పాసులు అందించే ప్రదేశాలు 
బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే వాహనాలకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లి దగ్గర  
మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు రంగంపేట కేఎంఎం కళాశాల వద్ద  
చెన్నై, నగరి, పుత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు వడమాలపేట టోల్‌ ప్లాజా సమీపంలోని అగస్త్య ఎన్‌క్లేవ్‌ వద్ద  
కడప వైపు నుంచి వచ్చే వాహనదారులకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హైసూ్కల్‌లో  
నెల్లూరు, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆర్‌ మల్లవరం పెట్రోల్‌ బంక్‌ వద్ద  
తిరుపతి పట్టణ ప్రజలకు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారికి కరకంబాడి రోడ్డులోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద.  

మరిన్ని వార్తలు