మామిళ్లపల్లె బ్లాస్టింగ్‌పై ఐదుగురితో కమిటీ

10 May, 2021 03:39 IST|Sakshi

ఐదు  రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక: మంత్రి పెద్దిరెడ్డి

తక్షణ పరిహారం కింద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షలు

బాధ్యులందరిపైనా చట్టపరమైన చర్యలు

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తింపు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలో సర్వేనెంబర్‌ 1లో జరిగిన బ్లాస్టింగ్‌ దుర్ఘటనపై గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు ఐదు శాఖలకు చెందిన అధికారులతో నియమించిన కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. కడప జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్‌ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజివ్స్‌ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటైన కమిటీ ఐదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని మంత్రి తెలిపారు.

పేలుడు ఘటనలో పదిమంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు జిల్లా డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ నిధి నుంచి తక్షణం రూ.పది లక్షలు, గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు  తెలిపారు. ఇప్పటికే కడప కలెక్టర్‌ ఘటనపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేశారని చెప్పారు. కార్మిక నష్ట పరిహార చట్టం 1923 ప్రకారం మృతి చెందిన కూలీల కుటుంబాలకు లీజుదారు నుంచి పరిహారం ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

ఏపీ ఎంఎండీ అండ్‌ ఆర్‌ చట్ట  ప్రకారం బాధ్యులందరిపై చర్యలు..
తాజా ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, ఎంఎండీ అండ్‌ ఆర్‌ చట్టం–1957 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. బాధ్యులు అందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన సమాచారం తెలియగానే  గనులు, భూగర్భశాఖ డైరెక్టర్‌ (డీఎంజి) వి.జి. వెంకటరెడ్డి, ఉప సంచాలకులు ఎం.బాలాజీ నాయక్, కడప అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి. రవి ప్రసాద్, రీజినల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్, మైనింగ్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. పేలుడు పదార్థాల రవాణా, అన్‌ లోడింగ్‌లో నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు. 
  

మరిన్ని వార్తలు