అదానీ పోర్టులో గంగవరం విలీనంపై కమిటీ

5 Jun, 2021 06:06 IST|Sakshi

ఆరుగురు ప్రభుత్వకార్యదర్శులతో ఏర్పాటు

ప్రభుత్వ 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం 

సాక్షి, అమరావతి: గంగవరం పోర్టు లిమిటెడ్‌ (జీపీఎల్‌)ను అదానీ పోర్టు సెజ్‌(ఏపీ సెజ్‌) లిమిటెడ్‌లో పూర్తిగా విలీనం చేసిన తర్వాత ఏర్పాటయ్యే ప్రత్యేక కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, గత ఒప్పందాలకు నష్టం వాటిల్లకుండా చూసేందుకు వివిధ  శాఖలకు చెందిన ఆరుగురు కార్యదర్శులతో సాధికారిక కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ కన్వీనర్‌గా ఉంటారు. రెవిన్యూ, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ప్రభుత్వ రంగ శాఖల కార్యదర్శి కేవీ రమణ, న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత కమిటీ సభ్యులుగా ఉంటారు. 

60 రోజుల్లోగా కమిటీ నివేదిక..
గంగవరం పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు కుటుంబానికి చెందిన 58.1 శాతం, విండి లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 31.5 శాతం షేర్లను ‘ఏపీ సెజ్‌’ కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. భవిష్యత్తు విస్తరణ కార్యక్రమాల కోసం జీపీఎల్‌ను పూర్తిగా ఏపీ సెజ్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అంగీకరించింది. గతంలో జీపీఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నిబంధనలు పాటిస్తూ ఆదాయానికి నష్టం లేకుండా కొత్తగా ప్రత్యేక కంపెనీ (ఎస్‌పీసీ)ని ఏర్పాటు చేస్తూ కొత్తగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. గత ఒప్పందాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేవిధంగా సూచనలతో 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కరికాల వలవన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సెజ్‌తో కొత్త ఒప్పందం చేసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అందులో తెలిపారు.

ఆ అంశాలు ఇవీ..
► ప్రస్తుతం ఉన్న రాయితీ ఒప్పందం, భాగస్వామ్య ఒప్పందాల్లో ఎటువంటి మార్పులు లేకుండా చూడాలి
► ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వానికి చెల్లింపులు జరగాలి
► ఈ ప్రాజెక్టుకు చెందిన ఆస్తులకు రక్షణ ఉండాలి
► ఈప్రాజెక్టులో ప్రభుత్వ హక్కులు, ప్రయోజనాలు యధావిధిగా ఉండాలి
► ఒప్పందం ముగిసిన తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి
► ఈ డిజిన్వెస్ట్‌మెంట్,  విలీనం, కొత్తగా ప్రత్యేక కంపెనీ ఏర్పాటు లాంటివి నిర్దేశిత సమయంలోగా పూర్తి కావాలి
► దీనిపై ఎస్‌బీఐ క్యాప్‌ ప్రతిపాదించిన ప్రభుత్వ వాటా ఉపసంహరణ అంశాన్ని ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కమిటీ పరిశీలించవచ్చు
► అనుభవజ్ఞుల సలహాలు అవసరమైతే కమిటీ తీసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు