‘చేయూత’తో లక్షల కుటుంబాల్లో మార్పు

17 Mar, 2022 03:58 IST|Sakshi
సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కన్నబాబు, చెల్లుబోయిన, విశ్వరూప్, అప్పలరాజు

పథకం అమలుపై మంత్రుల కమిటీ సమీక్ష

పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను వివరించిన అధికారులు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత పథకం లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో మార్పు తెచ్చిందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇళ్ళకే పరిమితమైన మహిళలు కొత్తగా వ్యాపారదక్షతను అలవరుచుకుని, ఆర్థికంగా కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నారని అన్నారు. చేయూత పథకం అమలుపై బుధవారం సచివాలయంలో మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశమైంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు, పినిపే విశ్వరూప్, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎం సలహాదారు (నవరత్నాల అమలు) శామ్యూల్‌తో పాటు పలువురు అధికారులు, భాగస్వామ్య కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వివిధ శాఖల అధికారులు చేయూత కింద మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహం, చేపడుతున్న కార్యకలాపాలను మంత్రులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల ద్వారా అందిస్తున్న 11 వేల ఉత్పత్తుల టర్నోవర్‌ ఈ ఏప్రిల్‌ నుంచి నెలకు రూ.కోటి నుంచి రూ. 5 కోట్లకు చేరుకోవాలన్నది లక్ష్యమని అధికారులు చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో 7,597 మంది మహిళా పారిశ్రామికవేత్తలు రూ.29.29 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. రెండో ఏడాది ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 12,208 రెడీమేడ్, వస్త్ర దుకాణాలు, నాన్‌ ఫార్మ్‌ లైవ్లీహుడ్‌ కింద 20,049 యూనిట్లు ఏర్పాటయ్యాయన్నారు.

సెర్ప్‌ సహకారంతో 78,066 వ్యాపారాలు, ఏజియో రిలయన్స్‌ భాగస్వామ్యంతో పదమూడు జిల్లాల్లో టెక్స్‌టైల్, అప్పారెల్, ఫుట్‌ వేర్‌ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 36,162 రిటైల్‌ షాప్‌లతో హిందూస్థాన్‌ లీవర్, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, ఐటీసీ వంటి సంస్థలతో మహిళల మధ్య వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు. 17 నెలల్లోనే రూ.783.93 కోట్ల విక్రయాలు జరిగాయని, రూ.94.07 కోట్ల నికర లాభాన్ని మహిళలు అందుకున్నారని తెలిపారు. కడప జిల్లా పులివెందులలో రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్‌ సుమారు కోటిన్నర టర్నోవర్‌ సాధించి లాభాలతో నడుస్తోందని, దీని ద్వారా  8 వేల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు