రికార్డులన్నీ బెడ్‌రూంకే.. ఆరోగ్య శాఖలో కామ‘రాజు’

29 Mar, 2021 09:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తారస్థాయికి చేరిన లైంగిక వేధింపులు

విధులు నిర్వర్తించలేమంటున్న ఏఎన్‌ఎంలు

ఈనెల 15న మెడికల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు

పట్టించుకోని జిల్లా అధికారులు

ఆడదంటే అతడి దృష్టిలో ఆటబొమ్మ. చీర చెంగు కనిపిస్తే చాలు కామంతో బుసలు కొట్టేస్తాడు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగినులను వేధింపులకు గురి చేస్తాడు. తాను చెప్పినట్లు వినకపోతే విధుల పరంగా ఇబ్బందులకు గురి చేస్తాడు. అతని వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో భరించలేని మహిళా ఉద్యోగులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం. యూనియన్‌ను అడ్డుపెట్టుకుని జిల్లా ఉన్నతాధికారులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేసి తన పబ్బం గడుపుకుంటూ వస్తున్నాడు. దీంతో ఇక తాము విధులు నిర్వర్తించలేమంటూ ఉద్యోగినులు గగ్గోలు పెడుతున్నారు. ఇదీ ఆరోగ్యశాఖలో ఓ కామరాజు లీలలు.   

గార్లదిన్నె: స్థానిక పీహెచ్‌సీలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ) నిర్వాకంతో ఉద్యోగినులు అభద్రతా భావంలో కూరుకుపోయారు. తెలుగునాడు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతగా ఉంటూ వచ్చిన అతను జిల్లా ఉన్నతాధికారులను సైతం తన చెప్పుచేతుల్లో ఉంచుకుని  ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో భరించలేక ఈ నెల 15న మెడికల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల సమాచారం మేరకు...  

రికార్డులన్నీ బెడ్‌రూంకే..  
విధుల నిర్వహణలో భాగంగా సీహెచ్‌ఓ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైద్య సేవలకు సంబంధించిన రికార్డులను ఏఎన్‌ఎంలు నిర్వహిస్తూ ఉంటారు. దీనిని అలుసుగా తీసుకున్న గార్లదిన్నె సీహెచ్‌ఓ.. ఏఎన్‌ఎంల్లోని అభద్రతా భావాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వారిని ఏకవచనంతో పిలుస్తూ వెకిలి చేష్టలతో విసిగిస్తున్నాడు.  తన మాట వినకపోతే బూతులతో విరుచుకుపడతాడు.

రికార్డుల నిర్వహణ సరిగా లేదని, జిల్లా కేంద్రంలోని తన బెడ్‌ రూంకు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానంటూ వేధిస్తున్నాడు.  తన మాట వినకపోతే ఉద్యోగం లేకుండా చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చే స్తున్నాడు.  దీంతో విసుగు చెందిన పలువురు ఏఎన్‌ఎంలు ఈ నెల 15న స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మెయిల్‌ ద్వారా డీఎంహెచ్‌ఓ దృష్టికి మెడికల్‌ ఆఫీసర్‌ తీసుకెళ్లారు.  

ఉన్నతాధికారి అండ?  
యూనియన్‌ నాయకుడిగా ఉంటున్న సదరు సీహెచ్‌ఓ.. చివరకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులను సైతం తన చెప్పుచేతల్లో ఉంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో బుక్కరాయసముద్రం మండలంలో పనిచేసే సమయంలోనూ అక్కడి ఉద్యోగినులను వేధించినట్లు ఆరోపణలున్నాయి. బెళుగుప్ప మండలంలో పనిచేస్తున్న సమయంలో ఏకంగా దళిత ఉద్యోగులను వేధించినట్లు సమాచారం. ఉద్యోగోన్నతిపై నెల్లూరుకు వెళ్లి అక్కడ నుంచి పామిడికి వచ్చారు. అక్కడ కూడా ఆయనపై పలు ఆరోపణలున్నాయి.

ప్రస్తుతం గార్లదిన్నె పీహెచ్‌సీలో పని చేస్తున్నాడు. తనపై ఎవరు ఫిర్యాదు చేసినా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా వారిని సైతం బ్లాక్‌మెయిల్‌ చేసి పబ్బం గడుపుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గార్లదిన్నె మెడికల్‌ ఆఫీసర్‌ సిఫారసు మేరకు జిల్లా కేంద్రంలోని 108 కాల్‌ సెంటర్‌కు డిప్యూటేషన్‌పై పంపినట్లు సమాచారం. ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కామాంధుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, అతన్ని కాపాడే యత్నం చేయడం పలు విమర్శలకు దారి తీస్తోంది.  

హెల్త్‌ డైరెక్టర్‌ దృష్టికి సమస్య 
తమ పట్ల సీహెచ్‌ఓ చేస్తున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా.. డీఎంహెచ్‌ఓ స్పందించకపోవడంతో ఏఎన్‌ఎంలు సమస్యను విజయవాడలోని హెల్త్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హెల్త్‌ డైరెక్టర్‌.. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాంటూ డీఎంహెచ్‌ఓను ఆదేశించినట్లు తెలిసింది.  అయితే దీనిపై ఎలాంటి విచారణ చేయకుండా సదరు సీహెచ్‌ఓను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడంపై బాధిత ఏఎన్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    

ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే
గార్లదిన్నె మండలంలో పనిచేస్తున్న సీహెచ్‌ఓ తమను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఏఎన్‌ఎంలు ఫిర్యాదు చేసింది వాస్తవమే. దీనిపై ఈనెల 15న రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మరుసటి రోజు కాపీని డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి మెయిల్‌ చేశా. తదుపరి ఆదేశాలు వస్తే విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాల్సి ఉంటుంది.
-డాక్టర్‌ షమీమ్‌ తాజ్‌, గార్లదిన్నె పీహెచ్‌సీ

చదవండి: మహిళలే టార్గెట్‌: పరిచయాలు పెంచుకుని..

మరిన్ని వార్తలు