8 నెలల్లో రూ. 7,128 కోట్లు 

12 Oct, 2021 04:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వేగంగా ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రంలోకి రూ. 7,128 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 31 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొంది. ఇందులో వైఎస్సార్‌ జిల్లాలో పిట్టి రైల్‌ ఇంజనీరింగ్, చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో హావెల్స్‌ ఇండియా ఏసీ తయారీ యూనిట్, వైజాగ్‌లో అరబిందో ఫార్మా స్టెరిలైట్‌ యూనిట్, మోల్డ్‌టెక్‌ ప్లాస్టిక్‌ కంటైనర్ల తయారీ, అనంతపురం జిల్లాలో ఎస్బీ ఎనర్జీ సోలార్‌ యూనిట్, కర్నూలు జిల్లాలో ఎస్‌బీజీ క్లీన్‌టెక్‌ ప్రాజెక్ట్స్, చిత్తూరులో కోకాకోలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ వంటి ప్రముఖ కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి.

ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కోసం డీపీఐఐటీ వద్ద ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ మెమోరాండం పార్ట్‌–ఏ దరఖాస్తు చేసుకున్నాయి. వీలయినంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో మొత్తం 26 యూనిట్లు వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 8,611 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇందులో జెమినీ ఈడిబుల్‌ ఆయిల్, ఇండియా మెటల్‌వన్, వసంత ఇండస్ట్రీస్, రంగ ప్రాక్టికల్‌ బోర్డ్స్, అయన సోలార్, ఫాక్స్‌లింక్‌ ఎలక్ట్రానిక్‌ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే 2020 సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 9,727 కోట్ల విలువైన 59 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. 42 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో రూ. 9,840 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి.   

మరిన్ని వార్తలు