ఏడుగురు చిన్నారులకు పరిహారం

2 Jun, 2021 04:45 IST|Sakshi
చిన్నారులకు పరిహారం మంజూరు పత్రాలను అందిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్, ప్రభుత్వ విప్‌ ఉదయభాను

అనంతపురం సప్తగిరి సర్కిల్‌/జగ్గయ్యపేట అర్బన్‌: కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఏడుగురు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించింది. మంగళవారం అనంతపురంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ వసీం సలీం, కలెక్టర్‌ గంధం చంద్రుడు బాధిత చిన్నారులు సత్యనాగ సాయికృష్ణతేజ, హేమంత్‌కుమార్, రాఘవేంద్ర, జేమ్స్‌బాండ్, దీపికలకు రూ.10 లక్షల చొప్పున చెక్‌లు అందజేశారు.

కృష్ణా జిల్లాలో ఇద్దరికి..
సత్యనారాయణపురానికి చెందిన షేక్‌ ఖలీల్, రేష్మా దంపతులు కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందారు. అనాథలైన వీరి పిల్లలకు మంగళవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రూ.20 లక్షల పరిహార ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కలెక్టర్‌ ఇంతియాజ్‌తో కలసి అందజేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 9 మంది చిన్నారులను గుర్తించామని కలెక్టర్‌  తెలిపారు.  

బాధిత రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందజేత
పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ల గ్రామానికి చెందిన రైతు గుమ్మ యలమంచయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.7 లక్షల పరిహారాన్ని మృతుడి భార్య గుమ్మ నాగమణికి ప్రభుత్వ విప్‌ ఉదయభాను, కలెక్టర్‌ ఇంతియాజ్‌ అందజేశారు.  

మరిన్ని వార్తలు