టైకీ పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం

13 Mar, 2021 03:25 IST|Sakshi
పరిహారం గురించి టైకీ యాజమాన్యంతో చర్చిస్తున్న మంత్రి కన్నబాబు, చిత్రంలో ఎమ్మెల్యే సతీష్‌

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.4 లక్షల చొప్పున..

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడి

కాకినాడ రూరల్‌: తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలోని టైకీ పరిశ్రమలో రియాక్టరు పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పన పరిహారాన్ని ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. బల్క్‌ డ్రగ్స్‌ తయారీ పరిశ్రమ ‘టైకీ’లో గురువారం రియాక్టరు పేలి ఇద్దరు మృతి చెందిన సంగతి విదితమే. గాయపడిన నలుగురు కోలుకుంటున్నారు. టైకీ పరిశ్రమ ఎదుట శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసనకు దిగారు. మంత్రి వెంటనే అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాల పక్షాన యాజమాన్యంతో చర్చలు జరిపారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. 

మృతులు సుబ్రహ్మణ్యం, వెంకటరమణ కుటుంబసభ్యులకు రూ.50 లక్షలు చొప్పన పరిహారం అందజేస్తామన్నారు. ఇందులో యాజమాన్యం రూ.40 లక్షలు, ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున అందజేస్తాయన్నారు. మృతుల కుటుంబాలకు ఇళ్ల స్థలం, కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే, గాయపడిన వారికి రూ.4 లక్షలు (ప్రభుత్వం రూ.లక్ష, యాజమాన్యం రూ.3 లక్షలు) చొప్పన పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన సత్యసాయిబాబు అనే వ్యక్తికి లక్ష రూపాయలు అదనంగా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం తెలియజేశారని, ప్రమాదంపై విచారణకు ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. చర్చల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, టైకీ పరిశ్రమ నిర్వహకుడు మురళీరాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు