ఆకతాయిల ఆటకట్టు.. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు

26 Aug, 2022 19:43 IST|Sakshi
ఆకివీడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికలు

బాలికల భద్రతకు భరోసా 

ఆకివీడు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత కోసం.. వారికి భరోసా కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తోంది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడూ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయకుండా ఈ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నాయి.
చదవండి: ఆయిల్‌ ఫామ్‌ సాగుతో డబ్బులే డబ్బులు.. పెట్టుబడులు పోగా ఎకరానికి లాభం ఎంతంటే?

ప్రతీ పాఠశాల వద్ద ఇలాంటి బాక్సులు ఏర్పాటు చేయాలి. అలాగే బాలికలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయించారు. ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో ముట్టుకున్నా, తాకినా వెంటనే తల్లిదండ్రులకు గాని, పెద్దలకు తెలియజేయాలంటూ ఫ్లెక్సీలో సూచించారు.

ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై చర్యలు 
పాఠశాల వద్ద ఉన్న ఫిర్యాదుల బాక్సులో రాత పూర్వకంగా విద్యార్థినులు సమాచారాన్ని తెలియజేయాలి. ఈ బాక్సుల్లోని ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ ఎంఈవో పరిష్కరిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాక్సుల్లో ఫిర్యాదులను పరిశీలించి ఎంఈవోకు సమాచారమిస్తారు. ఎంఈవో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 418 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 63,638 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. క్తొతగా ప్రారంభించిన 16 ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థినులతో పాటు 36 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 4,420 మంది, ప్రైవేటు విద్యా సంస్థల్లో సుమారు 22,570 మంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వీరికి అభయం కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు.

పాఠశాలల్లో ప్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు 
బాలికలు, విద్యార్థినులకు రక్షణగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పలు ఉచిత కాల్‌ సెంటర్‌ నెంబర్లు అందుబాటులో ఉంచింది. వేధింపులకు గురైనా, శరీరంపై చేయి వేసినా చైల్డ్‌ లైన్‌ నెంబరు 1098, పోలీస్‌ 100, దిశ హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ 112, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181కు ఫిర్యాదు చేయవచ్చు. దురుసుగా ప్రవర్తించినా, అసభ్యకరంగా మాట్లాడినా ఆ సమయంలో విద్యార్థునులు ఏం చేయాలో అవగాహన కలి్పస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు.

రక్షణ చర్యలు భేష్‌ 
బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయి. పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సు వల్ల ఈవ్‌ టీజింగ్‌ తగ్గుతుంది. బాలికలు నిర్భయంగా పాఠశాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు. 
– ఎన్‌.సిరి సన్నిత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్‌, ఆకివీడు

వేధింపులకు అడ్డుకట్ట 
విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పిస్తున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. మహిళలు, బాలికలకు పూర్తి రక్షణకల్పించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సులు, హెల్ప్‌లైన్ల ఏర్పాటుతో వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది. 
– ఎండీ.బషీరా, జెడ్పీ హైస్కూల్‌, ఆకివీడు

పాఠశాలల్లో ఫిర్యాదు బాక్సులు 
బాలికా సంరక్షణ  పథకం ద్వారా బాలికలు, విద్యార్థినులకు పూర్తి రక్షణ ఏర్పడుతుంది. ప్రతీ పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు, హెల్ప్‌లైన్‌ నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లైంగిక వేధింపులకు గురి చేసే వారికి శిక్ష పడేలా ఇవి దోహదపడతాయి. విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 
– డీ.వెంకట రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం   

మరిన్ని వార్తలు