జన్యుమార్పిడి బియ్యం కలకలం

6 Nov, 2021 05:09 IST|Sakshi

యూరోపియన్‌ యూనియన్‌ ఫిర్యాదు  

ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ బియ్యం ఎగుమతి ఉపసంహరణ 

జీఎం బియ్యాన్ని అనుమతించలేదని కేంద్రం స్పష్టం 

రంగంలోకి దిగిన ఐఏఆర్‌ఐ, జెనిటికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థ 

సాక్షి, అమరావతి: ప్రస్తుతం జన్యుమార్పిడి (జీఎం) బియ్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్‌ నుంచి ఎగుమతి అయిన బియ్యపు నూకల్లో జన్యుమార్పిడి రకాలున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ ఫిర్యాదు చేసింది. వీటి వినియోగంతో అనారోగ్యం బారిన పడడమే కాకుండా..పలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే వాదనలను తెరపైకి తీసుకొచ్చింది. అయితే జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతించబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌ నుంచి జూన్‌లో ఎగుమతి అయిన 500 టన్నుల బియ్యం ప్రస్తుతం పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో సహా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివాదానికి కేంద్రబిందువయ్యాయి.

వివిధ దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేసే యూరోపియన్‌ కమిషన్‌ చేసిన ఆకస్మిక తనిఖీల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఉన్న విషయం బయటపడింది. ఫ్రాన్స్‌కు చెందిన వెస్తోవ్‌ కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం పలు దేశాలను అప్రమత్తం చేసింది. దీంతో అమెరికాకు చెందిన మార్స్‌ ఆహార ఉత్పత్తుల కంపెనీ జీఎం అవశేషాలున్నాయనే భయంతో తాను ఉత్పత్తి చేసిన క్రిస్పీ ఎంఅండ్‌ఎం ప్రోడక్ట్‌ను మార్కెట్‌ నుంచి వెనక్కు తెప్పించింది. సేంద్రియ బియ్యంగా భావించి తాము ఇండియా నుంచి వచ్చిన ఆ బియ్యంతో ఈ ప్రోడక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. అమెరికా కంపెనీ చేసిన ఈ పనితో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వచ్చిన బియ్యాన్ని చాలా దేశాలు మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నాయి. 

రంగంలోకి ఐఏఆర్‌ఐ.. 
భారత్‌ నుంచే జన్యుమార్పిడి బియ్యం ఎగుమతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడెక్కడ జన్యుమార్పిడి వంగడాలను సాగు చేస్తున్నారనే దానిపై ముమ్మర తనిఖీ ప్రారంభించింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలోనూ ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలు లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు జీఎం రైస్‌ను ప్రయోగాత్మకంగానైనా పండిస్తున్నాయా అనే విషయంపై ఆరా తీస్తోంది. తమిళనాడుకు చెందిన నాలుగు సేంద్రీయ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులను రద్దు చేయడం, కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వరిపై చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలే ఇందుకు సాక్ష్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

రూ.65వేల కోట్ల నష్టం? 
భారత్‌ నుంచి ఏటా సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వరి ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ చేసిన ఫిర్యాదే గనుక నిజమైతే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుంది. జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతించదు. అయితే కొన్ని పరిశోధన కేంద్రాల్లో జీఎం రైస్‌పై క్షేత్రస్థాయి పరిశీలనలు సాగుతున్నాయి. దీన్ని ఐఏఆర్‌ఐ కూడా ధ్రువీకరించింది. ఇదే సందర్భంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగైదు సేంద్రియ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులు రద్దు చేసింది. ఏమీ లేనప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని యూరోపియన్‌ యూనియన్‌ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. 

ఎక్కడి నుంచి బియ్యం వెళ్లాయి? 
మహారాష్ట్ర అఖోలాలోని హోల్‌సేల్‌ బియ్యం వ్యాపారి ఓమ్‌ ప్రకాష్‌ శివప్రకాష్‌కి చెందిన సంస్థ నుంచి యూరప్‌కి పంపిన బియ్యంలో జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జెనిటికల్‌ ఇంజనీరింగ్‌ మదింపు కమిటీ, ఐఏఆర్‌ఐకి చెందిన వ్యవసాయ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలాఖరులోపు ఈ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రైవేటు విత్తన సంస్థల ప్రయోగ క్షేత్రాలను, ఇటీవల విడుదల చేసిన హైబ్రీడ్‌ వరి వంగడాలను కూడా ఈ బృందం తనిఖీ చేస్తోంది. 

మరిన్ని వార్తలు