నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి

1 Apr, 2023 03:29 IST|Sakshi

ఏజెన్సీలో పూర్తిస్థాయి వైద్యసౌకర్యాలు

వైద్యసిబ్బంది, మందుల లభ్యతకు చర్యలు

40 ఏళ్ల తర్వాత చింతూరుకు స్పెషలిస్ట్‌ డాక్టర్‌ నియామకం

సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియాలకు మందుల సరఫరా

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని

సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు నవజాత శిశువులను చికిత్సకు తీసుకొచ్చేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఆమె శుక్రవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, పాడేరు ఐటీడీఏ, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మారు­మూల గిరిజన ప్రాంతాలకు వైద్యసేవలు పూర్తిగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. చింతూరు వంటి మారుమూల గిరిజన ప్రాంతానికి 40 ఏళ్ల తర్వాత స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతల సచివాలయం  పరిధిలోని కిండ్లం గ్రామంలో ఇటీవల ఆరుగురు మరణించడంపై గిరిజనులు భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు.

ఈ సందర్భంగా వీరంతా హైబీపీ, ఖైనీ నమలడం, మూఢనమ్మకాలతో నాటువైద్యం చేయించుకోవడం వంటి కారణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు చెప్పారు. సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర తమ ప్రాంత వైద్య అవసరాల కోసం విన్నవించగా వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు, వైద్యవిద్య సంచాలకుడు వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు