ప్రొటీన్‌ ఉంటే.. ‘పాడి’పంటే!

22 Jun, 2021 09:06 IST|Sakshi

ప్రొటీన్‌తోనే పాడిపశువుల సమగ్ర ఎదుగుదల 

పిండోత్పత్తి, పాల దిగుబడికి అత్యంత కీలకం 

మాంసకృత్తులు పుష్కలంగా ఉన్న దాణా తప్పనిసరి

సాక్షి, అమరావతి: పాడి పశువులకు ప్రొటీన్‌ ఎంతో అవసరం. పశువుల సమగ్ర ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది.  పిండోత్పత్తి, పాల దిగుబడి, రోగ నిరోధక శక్తికి మాంసకృత్తులు కావాల్సి ఉంటుంది. నెమరువేసే జంతువుల్లో.. ప్రత్యేకించి పాడి పశువుల అన్నాశయాల్లో మేలు చేసే సూక్ష్మజీవులు(రూమెన్‌) అభివృద్ధి చెందాలంటే కనీసం 7 శాతం క్రూడ్‌ ప్రొటీన్‌(సీపీ) కావాలి. పది కిలోల పాల ఉత్పత్తికి కిలో క్రూడ్‌ ప్రొటీన్‌ అవసరమని పశు సంవర్థక శాఖ వైద్యాధికారి డాక్టర్‌ డి.నాగేశ్వరరావు చెప్పారు. ఈ సందర్భంగా పశువులకు ప్రొటీన్లు అందించే దాణా గురించి వివరించారు. 

  1. వేరుశనగ చెక్కలో 45 శాతం సీపీ ఉంటుంది. కాల్షియం, విటమిన్‌ బీ–12 అధికంగా ఉంటాయి. రూమెన్‌ సూక్ష్మ జీవుల కోసం ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది.
  2. సోయాబీన్‌ మీల్‌లో పుష్కలంగా పోషకాలుంటాయి. దీనిలో నాణ్యమైన ప్రొటీన్‌ లభిస్తుంది. పాలు పెరగడానికి ఇది తోడ్పడుతుంది. 40 శాతం సీపీ ఉంటుంది. 
  3. పొద్దు తిరుగుడు చెక్కలో 40 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. ఈ చెక్కలో పాలీ అన్‌ శాచ్యురేటెడ్‌  ఫాటి ఆసిడ్స్‌ ఉన్నాయి. ఆవులకు ఆహారంగా దీనిని ఆహారంగా ఇచ్చాక తద్వారా లభించే పాలను మనుషుల ఆరోగ్యం కోసం వినియోగిస్తుంటారు. ఈ పాలు తాగితే గుండె జబ్బులు దూరమవుతాయంటారు. 
  4. పత్తి చెక్క, కొబ్బరి పిండి, ఆవ పిండి వంటి వాటిని కూడా పాడి పశువులకు వినియోగిస్తారు. కాల్షియం తక్కువగా, ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉంటుంది. 
  5. కొబ్బరి పిండిని పాడిపశువులకు ఉత్తమ దాణాగా చెబుతుంటారు. దీనిలో ప్రొటీన్‌ నాణ్యమైంది. 90 శాతం వరకూ పొట్టలోనే జీర్ణమవుతుంది.  కొబ్బరి పిండిని దాణాగా వాడటం వల్ల పశువుల్లో వెన్న బిరుసుగా ఉండి నాణ్యమైన నెయ్యి వస్తుంది. 
  6. ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన పశువుల దాణా బ్రూవర్స్‌ గ్రెయిన్‌. సారా తయారీలో ఉపయోగించే తృణ ధాన్యాల నుంచి వచ్చే పిప్పి లాంటి పదార్థాలు.. నెమరువేసే జంతువులకు మంచి ఆహారం. క్రూడ్‌ ప్రొటీన్‌ 25, 30 శాతం, పీచు 25 నుంచి 27 శాతం వరకూ ఉంటుంది.
  7. తెలగ పిండిలో సీపీ 40 శాతం వరకూ ఉంటుంది. పైగా ఇది మంచి విరేచనకారి. ఎరుపు, నలుపు రకాల్లో ఇది దొరుకుతుంది.
  8. చేపపొడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చూడిని నిలబెడుతుంది. 
  9. పచ్చి గడ్డి, జనుము, పిల్లి పెసర, అలసంద, పారగడ్డి, హైబ్రీడ్‌ నేపియర్, తవుడు, జొన్న చొప్ప, రాగి పిండి వంటి వాటిల్లో కూడా ప్రొటీన్‌ ఉంటుంది.
మరిన్ని వార్తలు