సమగ్ర భూసర్వే పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం

6 Oct, 2021 04:21 IST|Sakshi

51 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే

సాక్షి, అమరావతి: అస్తవ్యస్తంగా మారిన భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైంది. తొలుత 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే దాదాపు పూర్తయింది. ఈ గ్రామాల కొత్త సర్వే రికార్డులను భూ సర్వే శాఖ త్వరలో విడుదల చేయనుంది. దీనికి ముందు సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్‌ 13 ముసాయిదా నోటిఫికేషన్లను ముద్రించనుంది. 51 గ్రామాల రీసర్వేలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించి.. తుది రికార్డులను రూపొందించామని అధికారులు తెలిపారు. తద్వారా మిగిలిన గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 

ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామం
పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ 51 గ్రామాల్లో 63,433 ఎకరాలను రీసర్వే చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియా ఇచ్చిన డ్రోన్‌ చిత్రాలు, భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్‌తో మళ్లీ సర్వే చేశారు. ఈ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి 588 వినతులు, సర్వేకి సంబంధించి 1,564 వినతులు వచ్చాయి. వాటిలో 95%కిపైగా వినతుల్ని మొబైల్‌ సర్వే బృందాలు పరిష్కరించాయి. రైతుల ఆమోదంతో తుది రికార్డులను రూపొందిస్తున్నారు. 

సాంకేతికతతో కచ్చితమైన కొలతలు 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూముల రికార్డులు వందేళ్ల క్రితం బ్రిటిషర్ల హయాంలో తయారుచేసినవి. అప్పట్లో చైన్‌ ద్వారా కొలిచి.. భూముల హద్దులు నిర్ణయించి రికార్డులు రూపొందించారు. వాటి ఆధారంగానే ఆ భూములు ఎన్నో తరాలుగా చేతులు మారుతూ వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసి తమ పేరున రిజిస్టర్‌ చేయించుకున్న వ్యక్తులు అధికారికంగా కొలతలు వేయించుకోవడం అరుదుగా జరిగేది. పాత రికార్డుల్లో ఉన్న హద్దుల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంతో కొలతలు మారిపోయి సరిహద్దు తగాదాలు, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. అడంగల్‌లో పాత రికార్డుల కొలతలు, ఇప్పటి కొలతలకు చాలా తేడాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసర్వేలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన కొలతలతో ఈ 51 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించారు.

వాటి ఆధారంగా భూముల రిజిస్టర్లు, గ్రామ మ్యాప్‌లను రూపొందించారు. ఈ వివరాలనే అడంగల్‌లో నమోదు చేస్తారు. చివరిగా ప్రతి భూమికి సంబంధించి ఒక విశిష్ట సంఖ్యను ఇవ్వనున్నట్లు సర్వే సెటిల్మెంట్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కెజియాకుమారి తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుతోపాటే తొలి దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను గతంలోనే ప్రారంభించారు. అందులో 2,500 గ్రామాల్లో ప్రీ డ్రోన్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో సర్వే పనుల్ని ముమ్మరం చేశారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ గ్రామాల్లో విజయవంతంగా సమగ్ర సర్వే పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రక్రియ ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు