అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక

16 Mar, 2021 11:39 IST|Sakshi

టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం

టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధి మార్పు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో 4వేల 70 ఎకరాల భూములు కొనుగోలు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డ ప్రముఖుల జాబితా వెల్లడి

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం నాడు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డ ప్రముఖుల జాబితాను నివేదిక వెల్లడించింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది. క్యాపిటల్ సిటీ, రీజియన్‌లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొంది.

టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని నివేదిక తెలిపింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పక్కా ఆధారాలు సేకరించిన మంత్రివర్గ ఉపసంఘం..
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటు చేశారని ఆరోపించింది. టీడీపీ నేతలు.. తెల్ల రేషన్ కార్డు దారులను బినామీలుగా వాడినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేల్చింది. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేసినట్లు గుర్తించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. నివేదికలో పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది.

ఇన్ సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డ ప్రముఖుల జాబితా…
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పేర్లు ఇవే.
1. నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీ ఎం
2. వేమూరు రవికుమార్ ప్రసాద్, నారా లోకేష్ సన్నిహితుడు
3.పరిటాల సునీత, మాజీ మంత్రి
4. జీవి ఎస్ ఆంజనేయులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే
5.లింగమనేని రమేష్, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని
6. పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే
7. లంకా దినకర్,
8. దూళిపాళ్ల నరేంద్ర,
9. కంభంపాటి రామ్మోహన్ రావు,
10. పుట్టా మహేష్ యాదవ్
పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది.

నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణల బినామీ దందా గురించి..
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉపసంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో లోకేష్ భూముల కొనుగోళ్లు చేసినట్లు పేర్కొంది. మొత్తం 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఇక లింగమనేని రమేష్.. తన భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను కూడా ఈ నివేదిక బయటపెట్టింది. నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది. 

ఇక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాల భూములు కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఇంకా భూముల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పేర్లు, రికార్డులు, ఆధారాలతో నివేదిక సమర్పించింది.

టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధి మార్పు
టీడీపీ నేతలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే సీఆర్డీయే పరిధిని నాటి చంద్రబాబు ప్రభుత్వం మార్చినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. నేతల భూముల కోసం చంద్రబాబు ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పేశారు. బాలక్రిష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయించారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించారు. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేశారు. అలానే సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కోడెల శివప్రసాద్‌కు భూములుకేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేశారని నివేదిక తెలిపింది.

మొవ్వ మండలం పెదముట్టేవి, చినముట్టేవిలో లింగమనేని భూముల కోసం.. కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీఆర్డీఏ సరిహద్దుల్లో మార్పులు చేసినట్లు నివేదిక వెల్లడించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. 5 ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూ కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక రేటు, ప్రైవేట్‌ సంస్థల మరొక రేటుకు భూముల అమ్మకాలు జరిపినట్లు తెలిపింది. సింగపూర్‌తో ఒప్పందంలోనూ అక్రమాలు గుర్తించిన మంత్రి వర్గ ఉపసంఘం పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక వెల్లడించింది.

చదవండి:
చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..?

మరిన్ని వార్తలు