ఈడీ దృష్టికి మార్గదర్శి అక్రమాలు!

16 Mar, 2023 04:34 IST|Sakshi

సమగ్ర నివేదిక సమర్పిం చిన ఏపీ సీఐడీ విభాగం 

అవి తీవ్రమైన నేరాలు.. దర్యాప్తు జరపండి 

కేంద్ర సంస్థలు, ఇతర రాష్ట్రాలను కోరిన సీఐడీ  

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంసీఎఫ్‌ఎల్‌) అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నిధులను దారి మళ్లించి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మార్గదర్శిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోపాటు ఇతర రాష్ట్రాల సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు కూడా విచారణ జరపాలని నివేదించింది.

ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపన్ను శాఖ, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పరిధిలోని ‘తీవ్రమైన ఆర్థిక నేరాల పరిశోధన విభాగం’(ఎస్‌ఎఫ్‌ఐవో)తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల సీఐడీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల విభాగాలకు ఫిర్యాదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పలు రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహిస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంతో చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సీఐడీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో తాము గుర్తించిన అక్రమాలు, అవకతవకలను వివరిస్తూ రూపొందించిన నివేదికను సీఐడీ అధికారులు జత చేశారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఈడీ, ఆదాయపన్ను, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలు, ఇతర రాష్ట్రాల సీఐడీ విభాగాలు దర్యాప్తు జరపాల్సినంత తీవ్రమైన నేరాలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ 
పాల్పడిందని అందులో స్పష్టం చేశారు. 

సీఐడీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ..
మార్గదర్శి చిట్స్‌ నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతోంది.
 చందాదారులకు చెల్లించాల్సిన డబ్బులను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఇవ్వకుండా రూ.కోట్లలో బకాయిలు పెడుతోంది. 
 చిట్‌ఫండ్స్‌ చట్టం ప్రకారం బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డుల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తోంది.
 చందాదారులకు చిట్‌ మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. ఇది రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం.
 చందాదారుల సొమ్మును అక్రమంగా బదిలీ చేస్తూ ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది.
 ఆదాయపన్ను చట్టాలను ఉల్లంఘిస్తూ చందాదారుల నుంచి పరిమితికి మించి భారీ మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడుతోంది.
 చెల్లింపులపై టీడీఎస్‌ చెల్లించడం లేదు. 

మరిన్ని వార్తలు