పల్లెల్లోనే సమగ్ర రెవెన్యూ సేవలు

25 Jan, 2021 03:38 IST|Sakshi

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాచరణ ప్రణాళిక

వీఆర్‌వోలకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు–3 హోదా

అధికార యంత్రాంగం కసరత్తు

సాక్షి, అమరావతి: పరిపాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 సేవలు అందిస్తున్న ప్రభుత్వం రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ సేవలను అనుసంధానం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. వందేళ్లుగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించని విధంగా భూముల రీసర్వేకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం శాశ్వత భూహక్కుల కల్పనకు చట్టం కూడా చేస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు భూములు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని స్థిరాస్తుల సర్వే పూర్తయిన చోట రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దీంతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి అవసరమైన పరికరాలు, సౌకర్యాల కల్పనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సన్నాహాలు చేస్తోంది.

వీఆర్‌వోలకు 6 నెలల శిక్షణ
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 295 సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలున్నాయి. వీటిలో జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లే ప్రస్తుతం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఏ గ్రామంలో రీసర్వే పూర్తయితే ఆ గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభిస్తూ రాష్ట్రమంతా విస్తరింపజేయాలన్నది సీఎం జగన్‌ లక్ష్యం. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రీసర్వే పూర్తయినందున అక్కడి గ్రామ సచివాలయంలో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. ఇదే తరహాలో రాష్ట్రమంతా చేయనున్నారు.

ఇందుకోసం రాష్ట్రంలోని మొత్తం గ్రామ/వార్డు సచివాలయాల్లోని గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో), డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలని రిజిస్ట్రేషన్‌శాఖ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చేయాలంటే మొదట వీఆర్‌వోకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు హోదా కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు–1, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు–2 గెజిటెడ్‌ హోదా కలిగి ఉన్నారు. కొత్తగా వీఆర్‌వోలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు–3 అని డిజిగ్నేట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశాలపై వీఆర్‌వోలకు 6 నెలలు, డిజిటల్‌ అసిస్టెంట్‌కు 45 నుంచి 60 రోజులు శిక్షణ ఇచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రణాళిక తయారు చేస్తోంది.

ఏర్పాటు చేయాల్సినవి ఇవీ..
రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రతి గ్రామ సచివాలయంలో 2 డెస్క్‌టాప్‌లు, ప్రింటర్, స్కానర్, బయోమెట్రిక్‌ యంత్రం, రికార్డు చేసేందుకు వెబ్‌కామ్, 3కేవీఏ యూపీఎస్, ల్యాన్, కంప్యూటర్‌ టేబుల్, ఆఫీసు టేబుల్, 13 కుర్చీలు, బీరువా అవసరమని అధికారులు ప్రతిపాదించారు. వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  

మరిన్ని వార్తలు