కామ్రేడ్‌ ఈశ్వరయ్య ఇక లేరు.. రైలు కిందపడి..

27 Sep, 2022 07:38 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఉపాధ్యాయుడిగా, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడిగా విశేష సేవలందించి ప్రజలకు సుపరిచితుడైన కామ్రేడ్‌ ఈశ్వరయ్య ఇక లేరు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం నగరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పామిడి మండలానికి చెందిన ఈశ్వరయ్య (65) రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదవీ విరమణ పొందాక ఈశ్వరయ్య అనంతపురం హౌసింగ్‌ బోర్డులో భార్యతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున అనంతపురం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్‌ఐ విజయకుమార్‌ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   

పలు రంగాల్లో సేవలు 
ఈశ్వరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే.. మరోవైపు సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించారు. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాలో జన విజ్ఞాన వేదిక ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జర్నలిస్టు కావాలనుకొని మాసప్రతిక ప్రారంభించి ప్రజలను చైతన్యపరిచే అనేక వ్యాసాలు రాశారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో రచయితగా పాటలు రాశారు. జిల్లాలో బళ్లారి రాఘవ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయడంలో ఆయన కృషి ఎనలేనది. అందరూ ఆయన్ను ‘ఈశ్వరయ్య సార్‌’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.   

తీరని లోటు 
అనంతపురం అర్బన్‌: ఎన్‌.ఈశ్వరయ్య అకాల మరణం సాంస్కృతిక రంగానికి తీరని లోటని ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లప్ప, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులుతో పాటు పలువురు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమాలను నడిపారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి మృతి బాధకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

మరిన్ని వార్తలు