ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతాం.. 

31 Oct, 2021 03:23 IST|Sakshi
డీఈవో కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల ఆందోళన 

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు తమను తిరిగి ఎయిడెడ్‌కు పంపొద్దని డిమాండ్‌ చేస్తూ శనివారం డీఈవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని ఆర్సీఎం యాజమాన్యంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు సారథ్యం వహించిన మైఖేల్, రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్సీఎం యాజమాన్యంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వానికి అప్పగిస్తూ లిఖిత పూర్వకంగా తెలియపర్చారని, అయితే మళ్లీ వెనక్కు తీసుకుంటామంటూ యాజమాన్యం వేధిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిరంకుశ పోకడలతో బానిస జీవితాన్ని గడుపుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చేందుకు అంగీకరించిన తమను తిరిగి వెనక్కు పంపొద్దంటూ డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవానీకి వినతిపత్రం ఇచ్చారు.    

మరిన్ని వార్తలు