తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే

27 Jun, 2021 04:29 IST|Sakshi
ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో చర్చిస్తున్న రైతు నాయకులు

హైకోర్టును ఆశ్రయించేందుకు వైఎస్సార్‌ జిల్లా రైతుల సన్నాహాలు 

28న రైతు సంఘాల ఆందోళన 

కడప (సెవెన్‌ రోడ్స్‌): రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై వైఎస్సార్‌ జిల్లాలోని రైతు సంఘాలు, మేధావులు భగ్గుమంటున్నారు. ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న తెలంగాణ ప్రభుత్వం నిత్య కరువు పీడిత రాయలసీమకు నీరందించే పథకాలపై అభ్యంతరాలు లేవనెత్తడాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణ వైఖరికి నిరసనగా ఈనెల 28వ తేదీన కడపలో ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. శనివారం రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా కన్వీనర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు శివారెడ్డి తదితరులు మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్‌.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్‌.గోవర్దన్‌రెడ్డి, బి.హరిప్రసాద్, పీరయ్య తదితరులను కలిసి రైతుల ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు.  

మరిన్ని వార్తలు