గోదావరిలో స్థిరంగా వరద 

10 Sep, 2021 02:31 IST|Sakshi
ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి గోదావరి పరవళ్లు

‘ధవళేశ్వరం’ నుంచి 7,62,609 క్యూసెక్కులు సముద్రంలోకి శ్రీశైలంలో 181.83 

టీఎంసీలకు చేరిన నీటినిల్వ

ప్రకాశం బ్యారేజీ నుంచి 51,800 క్యూసెక్కులు కడలిలోకి

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు: పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. గోదావరి డెల్టా కాలువలకు కొంతనీరు వదిలి, మిగిలిన 7,62,609 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ బ్యారేజి వద్ద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 70,577 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,426 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది.

ప్రస్తుతం శ్రీశైలంలో 878.80 అడుగుల్లో 181.8320 టీఎంసీల నీరు ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో 71.067 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి› చేసింది. నాగార్జునసాగర్‌లోకి 17,151 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 19,444 క్యూసెక్కులను స్పిల్‌ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.

ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 63,003 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 11,203 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 51,800 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు వదిలేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 26 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.84 టీఎంసీలకు చేరుకుంది. మరో 5.16 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. సోమశిల నుంచి వదలుతున్న నీటిలో కండలేరు రిజర్వాయర్‌లోకి 8,600 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం కండలేరులో 54.98 టీఎంసీల నీరుంది. కండలేరు నిండాలంటే ఇంకా 13.05 టీఎంసీలు అవసరం. 

మరిన్ని వార్తలు