దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా

13 Sep, 2020 03:41 IST|Sakshi

మత సంబంధ విషయాల్లో పుకార్లపై కఠిన చర్యలు

జిల్లా ఎస్పీలకు డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశం  

సాక్షి, అమరావతి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీలను డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశించారు. అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజీపీ ప్రకటనలోని అంశాలు..

► పెట్రోలింగ్‌ను పటిష్టపరచడంతో పాటు సోషల్‌ మీడియా పుకార్లపై నిఘా పెట్టాలి. మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలు కాపాడేందుకు సహకరించేలా అన్ని చర్యలు తీసుకోవాలి.
► బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం– 2013 ప్రకారం దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చాలి. సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. దేవాలయాలకు ఫైర్, ఎలక్ట్రిసిటీ ఆడిట్‌ నిర్వహించడంతో పాటు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలి.
► ఈ అంశాలపై నిర్వాహకులకు పోలీసు సిబ్బంది అవగాహన కల్పించాలి.
► అంతర్వేది ఆలయంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరం. 
► ‘ఈ ఘటనను ఆసరాగా చేసుకుని మత సామరస్యానికి ప్రతీకగా ఉండే రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి చర్యలను పోలీస్‌ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. అని డీజీపీ పేర్కొన్నారు. ఈమేరకు ట్వీట్‌ కూడా చేశారు. 

మరిన్ని వార్తలు