YS Jagan: పైడితల్లి అమ్మవారి సాక్షిగా మాటిచ్చారు.. ఆ మేరకు రూ.500 కోట్లతో..

21 Jun, 2022 19:27 IST|Sakshi

మాటమీద నిలబడే నేత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి  

పైడితల్లి ‘సాక్షి’గా ఇచ్చిన మాటప్రకారం వైద్య కళాశాల నిర్మాణం  

2014లో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినమాట తప్పిన వ్యక్తి చంద్రబాబు 

ఇప్పుడు కళాశాల నిర్మాణంపై మభ్యపెట్టే యత్నం  

పనులు పరిశీలిస్తే ప్రగతి తెలుస్తుంది..  

జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా గాజులరేగ సమీపంలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం చకచకా సాగుతోంది. మాస్‌ కాంక్రీట్‌ పనులను జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ మాట మీద నిలబడే నేత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు.

ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్పయాత్ర చేసిన సమయంలో విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పైడితల్లి అమ్మవారి సాక్షిగా జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారన్నారు. ఆ మేరకు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. 70 ఎకరాల్లో రూ.500 కోట్ల వ్యయంతో పనులు సాగుతున్నాయన్నారు. వైద్యకళాశాల మొత్తం విస్తీర్ణం 14 లక్షల చదరపు అడుగులు కాగా, తొలివిడతగా 6 లక్షల చదరపు అడుగుల కాంక్రీట్‌ పనులను ప్రారంభించామని చెప్పారు. తమది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వంగా పేర్కొన్నారు. మూడేళ్లలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.

అంత వరకు 2023–24 విద్యా సంవతర్సం నుంచి జిల్లా కేంద్రాస్పత్రిలో బోధన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కేంద్రాస్పత్రి ఆధునికీకరణ పనులు, ప్రీ ఇంజినీరింగ్‌ బిల్లిండ్‌ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఓ వైపు వైద్యకళాశాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుంటే, వైద్య కళాశాల ఎక్కడని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి టీడీపీ నాయకులు వస్తే కళాశాల ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు. చంద్రబాబు మాదిరి ఎన్నికల ముందు ఉత్తుత్తి జీఓలను జారీ చేసి, ప్రజలను మోసం చేసే అలవాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి లేదన్నారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ప్రకటించారని, ఆ తర్వాత మూడేళ్లు పట్టించుకోలేదన్నారు.

అనంతరం అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న మాన్సాస్‌ట్రస్టు వారు వైద్యకళాశాల నిర్మిస్తారని చెప్పారని, అది కూడా అమలు కాలేదన్నారు. 2019 ఏప్రిల్‌ 11లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఫిబ్రవరిలో వైద్య కళాశాలకోసం ఓ లేఖ విడుదల చేశారని, చంద్రబాబు మోసపూరిత మాటలను జనం బాగా గమనించి 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పారన్నారు. వైద్య కళాశాల నిర్మించడం లేదని అప్పట్లో చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు లేఖరాసిన విషయం ఇప్పుడు ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. జిల్లాను పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలవద్దకు వెళ్లారన్నారు. గరివిడి వేదికగా ఎన్టీఆర్‌ను గద్దెదించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. చంద్రబాబు దొడ్డిదారిన సీఎం అయ్యారని, ఆయన నాయకులు కూడా ఆవిధంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  

ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ప్రజలు కలగంటున్నారని తెలిపారు. ప్రజల ఆశలను నేరవేరుస్తూ.. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను సీఎం మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే జిల్లా ప్రజలకు బోధనాస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు నాలుగు ఇటుకులు, రెండు సిమ్మెంట్‌ బస్తాలువేసి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. అప్పటి సీఎం వైఎస్సార్, మంత్రి బొత్సల కృషితో తోటపల్లి ప్రాజెక్టు కల సాకరమయిందని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ చివరిదశకు వచ్చిందని, త్వరలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో జిల్లాకు జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయం మంజూరైందని, గిరిజన విశ్వవిద్యాలయం పనులు కూడా చేపడతామని చెప్పారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుటుంబం స్వయంగా డాక్టర్లు అయి ఉండి కూడా కోవిడ్‌ సమయంలో విశాఖపట్నంలో దాక్కొని జిల్లా ప్రజలను గాలికివదిలేశారని విమర్శించారు. ఒక్కపేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు లేవన్నారు.  

ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని గుర్తుచేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసి ప్రజల చిరకాలవాంఛ తీర్చారన్నారు. తను సీఎంగా ఉంటే కరోనా వచ్చేదా అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనా మహమ్మారికి ప్రపంచమే వణికి పోయిన విషయం హైదరాబాద్‌లో దాక్కొన్న చంద్రబాబుకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. వయసు పైబడడంతో మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ మాదిరి వైద్యకళాశాల కోసం తూతూమంత్రంగా ప్రకటనలు చేయలేదన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా సాగుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ ఇసరపు భారతి, జేసీ మయూర్‌అశోక్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సత్యప్రభాకర్, కేవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. 

వైద్యకళాశాల కాంక్రీట్‌ పనులను ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు