బెంగళూరు–బెజవాడ @ 370  కిలో మీటర్లు

24 Aug, 2021 04:15 IST|Sakshi

రూ.10 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం

పులివెందుల మీదుగా 5 జిల్లాల్లోంచి విజయవాడకు హైవే–65తో అనుసంధానం

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

చకచకా డీపీఆర్‌ రూపకల్పన

సాక్షి, అమరావతి: సాగిపో.. హాయిగా అంటూ రానున్న రోజుల్లో బెంగళూరు నుంచి విజయవాడకు ఎంచక్కా రోడ్డు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవాలంటే పలు మలుపులు తిరుగుతూ 560 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేయాలి. వామ్మో.. బెంగళూరు నుంచి విజయవాడకు రోడ్డు ప్రయాణమా అంటూ భయపడే పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. త్వరలో దాదాపు 370 కిలోమీటర్ల అధునాతన రహదారి అందుబాటులోకి రానుంది. ఈ రోడ్డు మీదుగా పెద్దగా ప్రయాణ బడలిక లేకుండా తక్కువ సమయంలో సుఖంగా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతమాల ప్రాజెక్టు రెండోదశ కింద దాదాపు రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందిస్తున్నారు. 

ఒక్క గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో రాష్ట్రమంతటికి కనెక్టివిటీ
ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరుకు నేరుగా సరైన రోడ్డు కనెక్టివిటీ లేదు. రెండు దశాబ్దాలుగా బెంగళూరుకు సరకు రవాణా కూడా బాగా పెరిగింది. కానీ సరైన రహదారి లేకపోవడంతో వ్యయప్రయాసలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇంతవరకు ఒక్క గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కూడా లేని విషయాన్ని గుర్తుచేశారు.
బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రూట్‌ మ్యాప్‌ 

బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తే... ఆరు జిల్లాలకు బెంగళూరుతో కనెక్టివిటీ పెరుగుతుంది. మరోవైపు ఆ గ్రీన్‌ఫీల్డ్‌  హైవేను కోల్‌కత్తా – చెన్నై హైవే–65తో అనుసంధానిస్తారు. దీంతో శ్రీకాకుళం వరకు జాతీయ రహదారి మీదుగా కనెక్టివిటీ కల్పించినట్లు అవుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతమాల రెండోదశ కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. 2023 ఏడాదిలో ఈ హైవే నిర్మాణానికి సన్నాహాలు చేపడతామని కేంద్రం మొదట చెప్పింది. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడి తేవడంతో ఈ ఏడాదే సన్నాహాలు మొదలుపెట్టి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.

కిలోమీటరుకు రూ.25 కోట్లు
బెంగళూరు–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మూడు రూట్‌ మ్యాప్‌లను ప్రతిపాదించింది. రూట్‌మ్యాప్‌ను నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వమే. బెంగళూరు నుంచి అనంతపురం జిల్లాలోంచి పులివెందుల మీదుగా వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా విజయవాడ వరకు హైవే నిర్మాణ రూట్‌మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాన్ని బట్టి బెంగళూరు నుంచి విజయవాడకు 560 కిలోమీటర్ల దూరం ఉంది. సాధ్యమైనంత తక్కువ దూరంతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను 370 కిలోమీటర్లు ఉండేలా డిజైన్‌ను ఖరారు చేశారు. కిలోమీటరుకు దాదాపు రూ.25 కోట్లు వెచ్చించి ఈ హైవే నిర్మిస్తారు. భూసేకరణ వ్యయం దాదాపు రూ.745 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని దాదాపు రూ.10 వేల కోట్లతో  నిర్మించనున్నారు. అందుకోసం డీపీఆర్‌ రూపొందించే బాధ్యతను టెండర్ల ద్వారా అర్వీ అసోసియేట్స్‌కు అప్పగించారు. 

ఈ హైవేతో ఇవీ ప్రయోజనాలు
► రెండు రాష్ట్రాల మధ్య వీలైనంత తక్కువ దూరంతో మెరుగైన రోడ్డు కనెక్టివిటీ సాధ్యపడుతుంది. 
► ప్రస్తుతం ఉన్న రహదారితో నిమిత్తం లేకుండా వేరుగా నిర్మిస్తారు. 
► హైవే వీలైనంతవరకు తక్కువ మలుపులతో నేరుగా ఉంటుంది. 
► ఈ రోడ్డు మార్గంలో సమీప పట్టణ ప్రాంతాల నుంచి హైవే మీదకు చేరేందుకు, హైవే నుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. 
► హైవేకు ఇరువైపులా, మధ్యలో డివైడర్‌ పొడవునా పచ్చదనం పెంపొందిస్తారు.  

మరిన్ని వార్తలు