20 రోజుల్లోపే ఇంటి నిర్మాణం పూర్తి

18 Jan, 2021 05:00 IST|Sakshi
కొమెరపూడిలో నిర్మించిన పక్కా గృహం

ప్రభుత్వ సాయంతో రాష్ట్రంలోనే తొలి పక్కా గృహం నిర్మించుకున్న లబ్ధిదారు 

సత్తెనపల్లి: ‘నవరత్నాలు–అందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం నుంచి స్థలం పొందిన లబ్ధిదారు కేవలం 20 రోజుల్లోపే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదివారం గృహప్రవేశం చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆ ఇంటిని ప్రారంభించగా.. లబ్ధిదారు సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి ప్రవేశించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన నరాల రత్నకుమారి, సత్యనారాయణరెడ్డి దంపతులు కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం గత నెల 26న రత్నకుమారికి ఇంటిస్థలం పట్టా అందజేస్తే, అదే రోజున పక్కా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.

ఇంటి నిర్మాణానికి సంబంధించి రాష్ట ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో రత్నకుమారి రెండో ఆప్షన్‌ (ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారు నచ్చిన చోట కొనుక్కుని ఇల్లు నిర్మించుకోవడం) ఎంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు మరో రూ.1.20 లక్షలు వెచ్చించి రూ.3 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం భవనం గట్టిగా ఉండేలా కాలమ్స్‌ నిర్మించి.. టైల్స్‌తో పక్కా ఇల్లు పూర్తి చేశారు.   

మరిన్ని వార్తలు