Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం

7 Nov, 2021 02:37 IST|Sakshi

రాష్ట్రంలోని 13 నగరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం

ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించిన ఏపీఐఐసీ

ఆస్పత్రులను నిర్మించే సంస్థలకు భూమి ఉచితం.. ఇప్పటికే సేకరణ పూర్తి

కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఒక్కో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం

భారీ పెట్టుబడి, ఎక్కువ పడకలతో నిర్మించే ఆస్పత్రులకు ఎంపికలో ప్రాధాన్యత

ఈ ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం పడకలు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి.. 

ఎంపికైన బిడ్డర్లదే నిర్మాణం, నిర్వహణ బాధ్యత.. నవంబర్‌ 25లోగా బిడ్ల దాఖలుకు అవకాశం

ఎంపికైన సంస్థ రెండేళ్లలో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలి

కోవిడ్‌ నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా వైద్య రంగం ఆవశ్యకతను, ఆధునిక వైద్య సేవల అవసరాన్ని ఈ మహమ్మారి నొక్కి చెప్పింది. కోవిడ్‌ తీవ్రతను ముందుగానే ఊహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పరంపరలో ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు ద్వారా మెరుగు పరచడంతో పాటు.. ముందు చూపుతో ప్రైవేట్‌ రంగంలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చేయూతనిస్తోంది. ఇలా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో సగానికి సగం బెడ్లు పేదలకు అందుబాటులో ఉండేలా వడివడిగా అడుగులు వేస్తోంది.

సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరమే లేకుండా, స్థానికంగానే అత్యుత్తమ వైద్యం  అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో 13 పట్టణాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి నగరాల నడిబొడ్డున ఆస్పత్రుల నిర్మాణానికి ఏపీఐఐసి ఉచితంగా భూమిని ఇవ్వనుంది.

ఇప్పటికే అవసరమైన మేరకు స్థలాలను సేకరించింది. రాష్ట్ర విభజన తర్వాత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అత్యధిక శాతం హైదరాబాద్‌కే పరిమితం కావడంతో కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీటి నిర్మాణం చేపట్టినట్లు ఏపీఐఐసీ టెండర్లలో పేర్కొంది. ఇందుకోసం ఆయా నగరాల్లో ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమిని సేకరించింది. ఆస్పత్రి నిర్మాణం, దాని నిర్వహణ.. బిడ్‌ దక్కించుకున్న సంస్థే నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఒక చోట లేదా వివిధ నగరాల్లో ఆస్పత్రులు నిర్మించడానికి బిడ్లను దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్‌ 6న మొదలైన బిడ్ల స్వీకరణ నవంబర్‌ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన బిడ్లను పరిశీలించి డిసెంబర్‌ 15న బిడ్డర్లను ఎంపిక చేస్తారు. బిడ్డింగ్‌లో ఎంపికైన సంస్థ రెండేళ్లలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. 

అధిక పెట్టుబడి పెట్టేవారికి ప్రాధాన్యత
► అత్యధికంగా ప్రత్యేక వైద్య సేవలు, అధిక పడకలు అందుబాటులోకి వచ్చే విధంగా బిడ్డింగ్‌లో నిబంధనలను పొందుపర్చినట్లు ఏపీఐఐసీ చీఫ్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి చోట కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, కనీసం 100 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంటుంది.  
► అయితే బిడ్డింగ్‌ ఎంపికలో అధిక పెట్టుబడితో అధిక పడకలు నిర్మించడానికి ముందుకు వచ్చే సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి ఆస్పత్రిలో కనీసం రెండు స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లను కలిగి ఉండాలి. ఈ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఎంపికలో వాటికి అంత ప్రాధాన్యత ఉంటుంది.  
► క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, బోన్‌ మారో వంటి చికిత్సలు అందించే వాటికి ఎంపికలో ప్రాధాన్యత అధికంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు.  

ఆరోగ్యశ్రీకి 50 శాతం పడకలు
► కొత్తగా నిర్మించే ఈ ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి తప్పనిసరిగా 50% పడకలను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా నగరాల్లో 2020లో వివిధ రోగాలకు చికిత్స తీసుకున్న వారి వివరాలను బిడ్‌లో పొందుపర్చారు. తద్వారా బిడ్డింగ్‌ దాఖలు చేసే సంస్థలు స్పెషాలిటీ చికిత్సలను ఎంపిక చేసుకోవడానికి సులభతరమవుతుంది.
► వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీకి ఎన్ని పడకలు అధికంగా కేటాయిస్తే బిడ్‌ ఎంపికలో అంత ప్రాధాన్యత పెరుగుతుంది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేసే వైద్యులు కూడా ఆయా నగరాల్లోనే నివసించాలన్న నిబంధన కూడా విధించారు. ఈ 13 ఆస్పత్రుల నిర్మాణం ద్వారా కనీసం రూ.2,500 కోట్ల పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు