రోడ్ల కోతకు ‘ఎఫ్‌డీఆర్‌’తో చెక్‌ 

27 Nov, 2022 04:50 IST|Sakshi

ఎఫ్‌డీఆర్‌ సాంకేతికతతో రోడ్ల నిర్మాణం 

ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో..  

సాక్షి, అమరావతి:  నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్‌ డెప్త్‌ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో  రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ జిల్లాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.

ఈ సమస్యను గుర్తించినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సాధారణ పరిజ్ఞానంతో రోడ్లు నిర్మిస్తూ తమ అనుయాయులైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించింది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెత్తటి నేలల్లో కూడా పటిష్టమైన రోడ్లు నిర్మించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర  రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఆర్‌డీసీ) రాష్ట్రంలో మొదటిదశ కింద చేపట్టిన రోడ్ల పునరుద్ధరణ పనుల్లో ఎఫ్‌డీఆర్‌ సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సీఐఆర్‌ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.  

వెయ్యి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందులో ఆర్‌ అండ్‌ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు  ఉన్నాయి. కిలోమీటరుకు సింగిల్‌ లైన్‌ అయితే రూ.80 లక్షలు, డబుల్‌ లైన్‌ అయితే రూ.1.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యాన్యుటీ విధానంలో ఈ రోడ్లు నిర్మిస్తారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.  

ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ అంటే.. 
మెత్తటి నేలలపై ఉన్న పాత రోడ్లను 300 మిల్లీమీటర్ల లోతువరకు తొలగిస్తారు. సిమెంట్, ఎమ్యల్షన్‌ అనే ప్రత్యేక ఎడెటివ్‌ రసాయనంతో చేసిన మిశ్రమాన్ని రోడ్డు, గ్రానైట్‌ వ్యర్థాల మిక్స్‌లతో కలిపి రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యతతో ఉంటాయి. దీంతోపాటు ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ పర్యావరణ హితమైనదని కూడా కావడం విశేషం.  

మరిన్ని వార్తలు