జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం 

8 Oct, 2021 04:21 IST|Sakshi
పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

అలిపిరి కాలిబాట సుందరీకరణ పనుల టెండర్లకూ ఆమోదం 

టీటీడీలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగ భద్రతకు కార్పొరేషన్‌  ఏర్పాటు 

దేవస్థానం ఉద్యోగుల ఆరోగ్య నిధికి గ్రీన్‌సిగ్నల్‌ 

టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయాలు 

తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని జమ్మూలో నిర్మించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నూతన బోర్డు తొలి సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా టీటీడీ చేపట్టే అభివృద్ధి, ఇతర మరమ్మతు పనుల టెండర్లను ఆమోదించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈఓ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులతోపాటు అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్‌ఓ గోపినాథ్‌ జెట్టి పాల్గొన్నారు. 

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. 
► జమ్మూలో రూ.17.4 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం టెండర్లను ఆమోదించారు. 
► చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్ల చైర్మన్ల నియామకానికి ఆమోదం. చెన్నైలో ఏజే శేఖర్‌రెడ్డి, బెంగళూరులో రమేష్‌శెట్టి, ముంబైలో అమోల్‌కాలే నియామకం. 
► రూ.7.5కోట్లతో అలిపిరి కాలిబాట సుందరీకరణ పనుల టెండర్లకు ఆమోదం. 
► రాయచోటిలో రూ.2.21 కోట్లతో  కల్యాణ మండపం నిర్మాణం టెండర్లకు ఆమోదం. 
► టీటీడీలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్‌ తరహాలో టీటీడీ కార్పొరేషన్‌ ఏర్పాటు, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య నిధి ఏర్పాటుకు ఆమోదం. 
► రూ.2.61కోట్లతో తిరుమలలోని శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం–2 మరమ్మతుల టెండర్లకు ఆమోదం. 
► స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చి భవనంలో రూ.4.46 కోట్లతో నిర్మించనున్న 4, 5 అదనపు అంతస్తుల నిర్మాణానికి టెండర్ల ఆమోదం. 

మరిన్ని వార్తలు