విద్యుత్‌ను పొదుపుగా వాడాలి

11 Apr, 2022 16:34 IST|Sakshi

ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ‘రోజూ జిల్లాలో 1.50 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినియోగమవుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ కె.విజయ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం నుంచి నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో అరగంట సేపు, గ్రామాల్లో గంటసేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. 

నెల్లూరులో ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు సరఫరా ఉండదన్నారు. కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో కొన్నింట్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు, మరికొన్నింట్లో 12.30 నుంచి ఒంటి గంట వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. రూరల్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 9 నుంచి పది గంటల వరకు, ఇంకొన్ని చోట్ల 12.00 నుంచి ఒంటి గంట వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. 

కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు ప్రతి మంగళవారం పవర్‌ హాలిడేగా నిర్ణయించామని ఎస్‌ఈ తెలిపారు. నెల్లూరు రూరల్, గూడూరు ప్రాంతాల్లోని పరిశ్రమలకు బుధవారం పవర్‌ హాలిడేగా ప్రకటించామన్నారు. వ్యవసాయానికి సంబంధించి రెండు గ్రూపులుగా విభజించి ఏడుగంటలపాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు