కోళ్ల 'మేత' కూత

1 Jun, 2021 04:53 IST|Sakshi

పౌల్ట్రీ మేతలో అధికంగా వినియోగించే సోయా ధరకు రెక్కలు

4 రెట్లు పెరిగిన సోయా ఎగుమతులు

చికెన్, గుడ్లపై మేత ధర ప్రభావం

సాక్షి, అమరావతి బ్యూరో: కోళ్ల దాణా ధర కొండెక్కింది. దీన్లో అధికంగా వినియోగించే సోయా రేటు పెరగడంతో ఆ ప్రభావం ఈ దాణాపై పడింది. అది చికెన్, కోడిగుడ్లపై ప్రభావం చూపుతోంది. సోయా ధర 4 నెలల్లో రెట్టింపయింది. ప్రస్తుతం చికెన్, గుడ్ల ధరలు కోళ్ల పెంపకందార్లకు ఊరటనిస్తున్నా పెరిగిన కోళ్ల మేత ధర భారంగా మారింది. కోళ్ల మేతను సోయా, మొక్కజొన్న, తవుడు, సజ్జలు, రాగులు, వరి నూక, వేరుశనగ చెక్కలతో తయారుచేస్తారు. వీటిలో సోయా, మొక్కజొన్నలను ఎక్కువగా వినియోగిస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సోయా ధర టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండేది. ప్రస్తుతం అది రూ.70 వేల నుంచి రూ.75 వేల మధ్య పలుకుతోంది. ఫలితంగా దాణా ధర నాలుగు నెలల్లో రూ.17 వేల నుంచి రూ.27 వేలకు చేరింది.

డిసెంబర్, జనవరిల్లో సోయా ధర టన్ను రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉన్నప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.2 వేల కోట్ల విలువైన సోయా ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది నాలుగు రెట్లు అధికంగా అంటే రూ.8 వేల కోట్ల ఎగుమతులు జరిగినట్టు పౌల్ట్రీ వర్తకులు చెబుతున్నారు. ఎగుమతులు ఎక్కువగా చేయడం వల్ల దేశీయంగా  సోయా కొరత ఏర్పడింది. దీంతో దాణా ధర పెరిగింది. కోడి పూర్తిస్థాయిలో ఎదగడానికి 6 వారాలు పడుతుంది. ఈ 6 వారాల్లో ఒక బ్రాయిలర్‌ (చికెన్‌) కోడి 4 కిలోలకుపైగా, గుడ్ల (లేయర్‌) కోడి గుడ్లుపెట్టే దశకు వచ్చే సరికి 8 కిలోల వరకు మేత తింటాయి. 4 నెలల కిందటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.10 చొప్పున మేత ధర పెరిగింది. అంటే బ్రాయిలర్‌ కోడిపై రూ.40, లేయర్‌ కోడిపై రూ.80 మేత ఖర్చు పెరిగింది. కోళ్ల మేత ధరల పెరుగుదల ఇంతలా ఊహించలేదని, ఇవే ధరలు కొనసాగితే పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటుందని కృష్ణా, గుంటూరు బ్రాయిలర్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు.  

కోళ్ల మేత వినియోగంలో 2వ స్థానం
ఇండియా పౌల్ట్రీ ఫీడ్‌ మార్కెట్‌ అంచనా ప్రకారం.. కోళ్ల మేత వినియోగంలో దేశంలోకెల్లా తమిళనాడు మొదటి స్థానంలోను, ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలోను ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా బ్రాయిలర్‌ కోళ్లకు సుమారు 1.50 మిలియన్‌ టన్నులు, లేయర్‌ కోళ్లకు 3.40 మిలియన్‌ టన్నుల మేత అవసరమవుతోంది. ఏటా చికెన్, గుడ్ల వినియోగం పెరుగుతుండడంతో ఆ మేరకు మేత అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. పౌల్ట్రీ రంగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వృద్ధిలో ఉన్నాయి. దీంతో మన రాష్ట్రంపై కోళ్ల మేత ఉత్పత్తి సంస్థలు దృష్టి సారించాయి.  

పెరిగిన గుడ్లు,చికెన్‌ వినియోగం
కోవిడ్‌ ఉధృతి సమయంలో కోడిగుడ్లు, చికెన్‌ వినియోగం పెరిగింది. కోడిగుడ్డు తింటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్న డాక్టర్లు, న్యూట్రిషనిస్టుల సూచనలతో ఎక్కువమంది వీటిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3 కోట్ల గుడ్లు వినియోగం అవుతుంటాయి. ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావంతో రోజుకు అదనంగా 50 లక్షల గుడ్ల వినియోగం పెరిగింది. అదే సమయంలో గుడ్ల ధరలు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఈనెల 5న విజయవాడలో 100 గుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ.370 ఉండగా 27 నాటికి రూ.541కి, విశాఖపట్నంలో రూ.360 నుంచి రూ.557కి పెరిగింది. మరోవైపు చికెన్‌ వినియోగం కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో రోజుకు సగటున 8 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. రెండేళ్ల కిందటితో పోల్చుకుంటే చికెన్‌ కొనుగోళ్లు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల కిలో చికెన్‌  ధర రూ.200కు అటుఇటుగా ఉంది.  

మరిన్ని వార్తలు