సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్‌ స్టోర్స్‌

8 May, 2022 05:51 IST|Sakshi

పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. 

రైతు బజార్‌ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడి 

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని రైతు బజార్ల ప్రాంగణాల్లో సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్‌ స్టోర్స్‌ అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రైతు బజార్ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ను రూపొందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖలో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్గానిక్‌ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్‌ లుక్‌తో రైతు బజార్‌ ప్రాంగణాల్లో విక్రయాలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 5, విజయనగరం జిల్లాలో 2 నుంచి 3 కంటైనర్‌ స్టోర్స్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్‌లకు కంటైనర్‌ స్టోర్స్‌ను విస్తరిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు