ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు: ఏపీ హైకోర్టు

5 Oct, 2022 08:40 IST|Sakshi

అది చట్టబద్ధ హక్కు మాత్రమే

నామినేషన్‌ తిరస్కరణ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదు

ఏపీ సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఎన్నికల కేసులో హైకోర్టు తీర్పు 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ప్రాథమిక హక్కు కాదని, చట్టబద్ధ హక్కు మాత్రమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. నామినేషన్‌ తిరస్కరణ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదని, దానికి విచారణార్హత లేదని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ ఏపీ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం కింద జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చునంది. ఎన్నికల అధికారి నియామకాన్ని కూడా అక్కడే సవాలు చేసుకోవాలని తెలిపింది. ఆ పిటిషన్‌ను 6 నెలల్లో పరిష్కరించాలని జిల్లా కోర్టును ఆదేశిస్తూ జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీర్పు చెప్పారు.

ఏపీ సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఎన్నికల్లో తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రెవెన్యూ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ వాసుదేవరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఆయన తరఫు న్యాయవాది తాతా సింగయ్యగౌడ్‌ వాదనలు వినిపిస్తూ, సంఘం కార్యదర్శి పోస్టుకు పిటిషనర్‌ నామినేషన్‌ దాఖలు చేశారని, అన్నీ పక్కాగా ఉన్నా కూడా ఓటర్ల జాబితాలోని సీరియల్‌ నంబర్‌తో  పేరు సరిపోలడంలేదంటూ నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. దీని ద్వారా పిటిషనర్‌ ప్రాథమిక హక్కులను హరించారని తెలిపారు.

చదవండి: (గుడ్‌న్యూస్‌: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’)

ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వ్యక్తి నియామకం చెల్లదని, అతను సెక్షన్‌ ఆఫీసర్‌ కాదని, అసిస్టెంట్‌ సెక్రటరీగా పదోన్నతి పొందారని తెలిపారు.  ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని తెలిపారు. ఏపీ సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఏపీ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం కింద ఏర్పాటైందని, అందువల్ల నామినేషన్‌ తిరస్కరణపై జిల్లా కోర్టులో సవాల్‌ చేయాలన్నారు. ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. అసోసియేషన్‌ తరఫు న్యాయవాది అప్పారావు వాదనలు వినిపిస్తూ, ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో కోర్టు జోక్యం తగదన్నారు. ఫలితాల తరువాత జిల్లా కోర్టులో పిటిషన్‌ వేయడమే పిటిషనర్‌ ముందున్న మార్గమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు