రహదారుల విస్తరణకు ఒప్పందాలు పూర్తి

2 Mar, 2021 05:06 IST|Sakshi

ఏప్రిల్‌ నుంచి పనులు ప్రారంభించనున్న 12 కాంట్రాక్టు సంస్థలు

145 ఎకరాల భూసేకరణ కోసం రెవెన్యూ యంత్రాంగానికి ఆర్‌ అండ్‌ బీ లేఖ

రెండేళ్లలో పనులు పూర్తి

రూ.1,860 కోట్లతో 1,200 కి.మీ.  రహదారుల విస్తరణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) సంయుక్త నిధులు రూ.1,860 కోట్లతో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండేళ్లలో రహదారుల విస్తరణ పనులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 12 కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవి ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1,200 కి.మీ. మేర రోడ్ల విస్తరణ చేపట్టనున్నాయి. 13 జిల్లాల్లో మూడు ప్యాకేజీల కింద ఎన్‌డీబీ టెండర్లను గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. రివర్స్‌ టెండర్లు నిర్వహించగా.. రూ.81.58 కోట్లు ఆదా అయిన సంగతి తెలిసిందే. 

ఏటా 11.8 శాతం ట్రాఫిక్‌ వృద్ధి
ఏపీలో ఏటా 11.8 శాతం ట్రాఫిక్‌ వృద్ధి చెందుతోందని ఎన్‌డీబీ సర్వేలో వెల్లడైంది. ఇందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణ పనులకు రుణ సాయం అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. విడతలవారీగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌డీబీ మొత్తం రూ.6,400 కోట్లను రహదారుల విస్తరణ పనులకు కేటాయించనున్నాయి. రాష్ట్రంలో ఏపీ మండల కనెక్టివిటీ అండ్‌ రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు ఎన్‌డీబీ రుణ సాయం అందించనుంది. రెండో విడత రహదారి విస్తరణ పనుల కోసం త్వరలో టెండర్లను నిర్వహించనున్నారు.

145 ఎకరాల భూమి అవసరం
13 జిల్లాల్లో తొలి విడతలో చేపట్టే రహదారుల అభివృద్ధికి 145 ఎకరాల భూమి అవసరం. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగానికి ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు లేఖ రాశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి అప్పగిస్తే ఏప్రిల్‌లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. కాగా, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.88 కోట్లను కేటాయించింది. 

 రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సిందే..
న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం రోడ్ల విస్తరణ పనులను 2023 కల్లా పూర్తి చేయాల్సిందే. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.     
– వేణుగోపాలరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ 

మరిన్ని వార్తలు