Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ

3 Jul, 2022 14:40 IST|Sakshi
అనంతపురం కలెక్టరేట్‌ సమీపంలో వరదాపురం సూరి కారుచౌకగా కొట్టేసిన రూ.130 కోట్ల విలువైన స్థలం 

వరదాపురం సూరి భూఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ 

అనంతపురం కలెక్టరేట్‌ పక్కనే రూ.130 కోట్ల విలువైన స్థలం కబ్జా 

ముదిగుబ్బ మండలంలో 155 ఎకరాలు ప్రభుత్వ భూముల స్వాహా 

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు..విచారణ ముమ్మరం 

విచారణకు సిద్ధమైన సివిల్‌ పోలీసులు

సాక్షి, పుట్టపర్తి: భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీ పరిధిలోని చండ్రాయునిపల్లి గ్రామంలో 155 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కొనుగోలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు.

గ్రామం చుట్టూ వరదాపురం సూరి భూములు కొనుగోలు చేయడం వల్ల చండ్రాయునిపల్లి గ్రామ వాసులు దారిలేక ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఆక్రమణలపై ఆర్డీఓ, తహసీల్దార్లకు గ్రామస్తులు పలుసార్లు మొరపెట్టుకున్నారు. చివరకు డిప్యూటీ   కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయగా,  సూరి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని, వాటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. 

కారుచౌకగా రూ.130 కోట్ల భూమిని కొట్టేసిన వైనం 
అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వంద గజాల సమీపంలోనే రూ.130 కోట్ల విలువైన భూమిని వరదాపురం సూరి అక్రమంగా కొనుగోలు చేశారు. అన్‌రిజిస్టర్డ్‌ డాక్యుమెంటు సృష్టించి కారుచౌకగా తన కుమారుడు గోనుగుంట్ల నితిన్‌ సాయితో పాటు అతని అనుచరుడి పేరుతో కొనుగోలు చేశారు. దీనిపై కూడా బాధితులు జిల్లా రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రార్, కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. సూరి భూ కుంభకోణాలపై పలువురు కలెక్టర్‌కు, ఎస్పీకి, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) రంగంలోకి దిగింది.  

చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి)

సూరి కొనుగోలు చేసిన భూములు, అప్పట్లో జరిపిన లావాదేవీలు, ఆ సొమ్ములు ఎక్కడనుంచి వచ్చాయి తదితర వాటిని ఆరా తీస్తున్నారు. వరదాపురం సూరితో పాటు ఇందులో ఇంకా ఎవరైనా పాత్రధారులు ఉన్నారా... అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూముల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు అధికారుల స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు సివిల్‌ పోలీసులు కూడా తమకు అందిన ఫిర్యాదుల మేరకు వరదాపురం సూరి అక్రమాలపై దర్యాప్తు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి అనంతపురం జిల్లా పోలీసులే దర్యాప్తు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో భూఆక్రమణలపై ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ కూడా చేశారు.  

ఫిర్యాదుల మేరకే దర్యాప్తు 
వరదాపురం సూరి భూ ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేరకే దర్యాప్తు చేస్తున్నాం. ఏసీబీ దర్యాప్తు మొదలైంది. ఏసీబీ తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై కూడా పూర్తిస్తాయిలో విచారణ చేస్తాం. అక్రమాలున్నట్టు తేలితే ఎంత పెద్ద వారున్నా చర్యలు తీసుకుంటాం. 
– డా.ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం  

మరిన్ని వార్తలు