ఏపీ, పశ్చిమ ఆ్రస్టేలియా పరస్పర సహకారం 

26 Mar, 2023 04:09 IST|Sakshi

వైద్య రంగంలో నూతన సాంకేతికత, ఆవిష్కరణలు ఇచ్చి పుచ్చుకుంటాం 

ఇప్పటికే 8 ఎంవోయూలు చేసుకున్నాం 

రోబోటిక్, స్పేస్‌ తదితర రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాం 

వీటి సాంకేతికతను భారత్‌కూ అందిస్తాం 

వైద్య ఆవిష్కరణల్లో మెడ్‌టెక్‌ జోన్‌ది విశిష్ట స్థానం 

పశ్చిమ ఆ్రస్టేలియా మంత్రి స్టీఫెన్‌ డాసన్‌ 

మెడ్‌టెక్‌ జోన్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం 

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ – పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోనున్నట్లు పశ్చిమ ఆస్ట్రేలియా ఇన్నోవేషన్, డిజిటల్‌ ఎకానమీ, మెడికల్‌ రీసెర్చి మంత్రి స్టీఫెన్‌ డాసన్‌ తెలిపారు. శనివారం విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లోని పలు సంస్థలను డాసన్‌ నేతృత్వంలోని వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం సందర్శించింది.

అనంతరం మంత్రి డాసన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇప్పటికే ఎనిమిది ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. అవి సత్వరమే కార్యరూపం దాల్చేలా రెండు ప్రభుత్వాలు చర్యలు కూడా చేపట్టాయన్నారు. వెస్టర్న్‌ ఆస్ట్రేలియాకు, ఆంధ్రప్రదేశ్‌కు దగ్గర పోలికలున్నాయని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, వనరుల లభ్యత వంటి వాటిలో సామీప్యత ఉందన్నారు. రోబోటిక్, ఆటోమేషన్, స్పేస్, రక్షణ, ఇంధన రంగాలపై తాము 60 ఏళ్లుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, వీటి సాంకేతికతను భారత్‌కూ అందిస్తామని తెలిపారు.

తమ విద్యార్థులను భారత్‌లో విద్యాభ్యాసానికి పంపిస్తామన్నారు. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ అద్భుత ఆవిష్కరణలతో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందని కొనియాడారు. కోవిడ్‌–19  సమయంలో మెడ్‌టెక్‌ జోన్‌ జరిపిన పరిశోధనలు ప్రపంచానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కోవిడ్‌తో వైద్యపరమైన అనేక సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని వైద్య సాంకేతికతతో ఎదుర్కోగలుగుతున్నామని, వ్యాక్సిన్‌తో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు.

అంతకుముందు మెడ్‌టెక్‌ జోన్‌లో వివిధ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌లతో మంత్రి డాసన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో డాసన్‌ మాట్లాడుతూ వైద్య రంగంలో అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధకులకు మూడు, ఐదు సంవత్సరాల ఫెలోషిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు.

అత్యధిక వృద్ధి సామర్థ్యం కలిగిన స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చేందుకు పెర్త్‌ ల్యాండింగ్‌ ప్యాడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. సాంకేతిక రంగంలోని కంపెనీలు వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను వృద్ధి చేసుకోవచ్చని సూచించారు. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ, సీఈవో జితేంద్రశర్మ మాట్లాడుతూ జీ–20లో భాగంగా వెస్టర్న్‌ ఆస్ట్రేలియా మెడ్‌టెక్‌ జోన్‌తో జీ2జీ ఒప్పందానికి ఆలోచన చేయాలని కోరారు. సమావేశంలో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌ కమిషనర్‌ (ఇండియా–గల్ఫ్‌ రీజియన్‌) నషీద్‌ చౌదరి  తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు