సంపూర్ణ ‘సహకారం’తో స్వయం సమృద్ధి

15 Nov, 2021 04:18 IST|Sakshi

సహకార వారోత్సవాలు ప్రారంభం

ఈ నెల 20 వరకూ నిర్వహణ  

సహకార సంఘాల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం  

సంఘాల్లో మరింత మంది చేరేలా ప్రోత్సాహం 

సాక్షి, అమరావతి: సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా, పరస్పర సహకారమే లక్ష్యంగా, సంపూర్ణ సహకారాన్ని పొందడమే ఉద్దేశంగా సహకార సంఘాల వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వయం సమృద్ధే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయి. సహకార సంఘాల నుంచి సభ్యులు నగదును అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని.. సొంత కాళ్లపై నిలబడగలిగేలా చేసేందుకు ఈ వారోత్సవాలు తోడ్పడాలన్నది లక్ష్యం. గ్రామీణ యువత తమ సొంత సహకార సంఘాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయొచ్చు. ఈ సంఘాల్లో ప్రజలు క్రియాశీల పాత్ర పోషించేలా చేసి, వారి పొదుపు మొత్తాలు ఏదో ఒక ఉత్పాదకతకు ఉపయోగపడేలా చేయడం కోసం ఈ సహకార ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం బాగానే ఉన్నా రానురాను ఈ సంఘాల సంఖ్య తగ్గిపోతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార సంఘాల్లో మరింత మంది చేరేలా ప్రోత్సహించాలని సంకల్పించింది. సహకార వారోత్సవాల్లో భాగంగా.. సహకార సంఘాల ప్రయోజనాలు, వాటి పని తీరు మరింత మందికి చేరువయ్యేలా ప్రచారం చేస్తారు. తెలుసుకున్న సమాచారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ఇతరులకు కూడా వివరిస్తుంటారు. సమాచార మార్పిడితో పాటు ఇతరులకు మనం ఎంతమేర ఉపయోగపడగలం అనే భావాన్ని ప్రోత్సహించడం చేస్తుంటారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైనందున వాటిని కూడా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలకు సూచించింది.

రాష్ట్రంలో పరిస్థితి..   
రాష్ట్రంలో సహకార సంఘాలు చట్టపరమైన హోదా కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా ఉంటున్నాయి. వీటి అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సహకార సంఘాల నియంత్రణకు రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయి. ఒకటి.. 1964 చట్టాన్ని 2001లో సవరించారు. సహకార సూత్రాలకు అనుగుణంగా సహకార సంఘాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ నియంత్రణను కొంత వరకూ తగ్గించడమే దీని లక్ష్యం. రెండోది.. మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ చట్టం.రాష్ట్రంలో సుమారు 67,268 సహకార సంఘాలున్నాయి. అవి.. వాటిలో రాష్ట్రస్థాయి సహకార సంఘాలు 10, కాగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 13, ప్రాథమిక సహకార సంఘాలు 2,037, పాల సహకార సంఘాలు 90, మార్కెటింగ్‌ సహకార సంఘాలు 13, గిరిజన సహకార సంఘం 1, చేనేత సహకార సంఘాలు 470, చక్కెర మిల్లుల సహకార సంఘాలు 10, సేవా రంగ సహకార సంఘాలు 1414, ఇతరత్రా సంఘాలు 63,210 ఉన్నాయి. అయితే వీటిలో పలు సంఘాలు పనిచేయడం లేదని ఇటీవలి ఆడిట్‌ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. పీఏసీఎస్‌లను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. నాబార్డ్‌ సహకారంతో ఈ ప్రక్రియ సాగుతోంది. 

మరిన్ని వార్తలు