Cordelia Cruise Ship Details: మాములుగా లేదు మరి.. షిప్‌ లోపల ఓ లుక్కేయండి..

9 Jun, 2022 08:49 IST|Sakshi
కార్డీలియా క్రూయిజ్‌ నౌక

దొండపర్తి(విశాఖ దక్షిణ): మూడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణం.. సెవెన్‌ స్టార్‌ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్‌నెస్‌ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్‌ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్‌ క్లైంబింగ్‌ విన్యాసాలు.. హ్లాదపరిచే డ్యాన్స్‌ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్‌ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్‌ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమైంది. విశాఖ వాసులను ఎంతో కాలంగా ఊరిస్తున్న విహార నౌక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు విదేశాలతో పాటు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కార్డీలియా ఎంప్రెస్‌ విహార నౌక ఇప్పుడు విశాఖ తీరానికి వచ్చేసింది. ఈ నెల 6వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌కు చేరుకుంది. 

నగరానికి 1,200 మంది పర్యాటకులతో.. 
చెన్నై నుంచి 36 గంటల పాటు ప్రయాణించిన ఈ కార్డిలియా నౌకలో 1,200 మంది పర్యాటకులు విశాఖకు చేరుకున్నారు. ఇందులో సుమారు 800 మంది ప్రయాణికులు ఇక్కడ దిగిపోయారు. మిగిలిన వారు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు అదే క్రూయిజ్‌లో ప్రయాణించనున్నారు. విశాఖకు చేరుకున్న తరువాత వీరికి ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పించి నగరంలో వివిధ సందర్శనీయ ప్రదేశాలకు తీసుకువెళ్లారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి వీరిని క్రూయిజ్‌ టెర్మినల్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.  


విశాఖ నుంచి 1,345 మంది పర్యాటకులు 
విశాఖ నుంచి బుధవారం రాత్రి 8 గంటలకు ఈ కార్డీలియా నౌక విశాఖ నుంచి బయలుదేరింది. ఉదయం 8 గంటలకే పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌కు నౌక చేరుకున్నప్పటికీ.. సాయంత్రం 4 గంటల నుంచి పర్యాటకులను అనుమతించారు. ఇక్కడి నుంచి 1,345 మంది బయలుదేరారు. వారందరిని తనిఖీ చేసి క్రూయిజ్‌లోకి అనుమతించారు. చాలా మంది విశాఖ నుంచి టికెట్లు దొరక్కపోవడంతో చెన్నై నుంచి టికెట్లు కొనుగోలు చేశారు. ముందుగానే చెన్నై వెళ్లిపోయి అక్కడ నుంచి క్రూయిజ్‌లో విశాఖకు వచ్చారు. 


రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్‌ 

కార్డీలియా క్రూయిజ్‌ సర్వీసు వాస్తవానికి విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్వీప్‌ వంటి ప్రాంతాల్లో ఉండేది. దేశంలోనే కాకుండా శ్రీలంకకు కూడా ఈ నౌకా యాత్ర ఉండేది. అయితే శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో క్రూయిజ్‌ యాజమాన్యం శ్రీలంక సర్వీసును నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఇతర ప్రాంతానికి క్రూయిజ్‌ సర్వీస్‌ నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్వీసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందు మూడు సర్వీసులు నడిపి డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ విహారయాత్రకు విస్తృతంగా ప్రచారం 
కల్పించింది.  

Visakhapatnam To Chennai Cordelia Cruise Ship Ticket Prices
అద్భుత స్పందన 

చెన్నై–విశాఖ–పుదుచ్చేరి–చెన్నై సర్వీసు నడుపుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన వెంటనే విక్రయాలు జోరుగా సాగాయి. ఈ నెలలో మూడు సర్వీసులకు ఇప్పటికే 90 శాతం మేర టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న మాదిరిగానే సెప్టెంబర్‌ వరకు విశాఖ నుంచి సర్వీసు నడపాలని నిర్వాహకులు నిర్ణయించారు. విశాఖలో ఈ క్రూయిజ్‌ నిర్వహణ బాధ్యతలను విశాఖ పోర్టు అథారిటీ అధికారులు జేఎం భక్షీ అనే సంస్థకు అప్పగించారు.  


విశాఖ నుంచి ప్రతీ బుధవారం సర్వీసు 

కార్టీలియా క్రూయిజ్‌కు విపరీతమైన డిమాండ్‌ రావడంతో ప్రతీ బుధవారం విశాఖ నుంచి చెన్నైకు సర్వీసును నడపనున్నారు. ప్రతీ సోమవారం చెన్నై నుంచి నౌక బయలుదేరి బుధవారం విశాఖకు చేరుకుంటుంది. ఇక్కడ అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి పుదుచ్చేరి మీదుగా చెన్నైకు వెళుతుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11వ తేదీన చెన్నైకు వెళుతుంది. తిరిగి ఈ నెల 13వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకుంటుంది. విశాఖ నుంచి చెన్నై వరకు ముందు ఒకవైపు టికెట్‌ తీసుకున్నప్పటికీ.. అటునుంచి కూడా విశాఖకు ప్రయాణాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ క్రూయిజ్‌లో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. అయితే ఎయిర్‌పోర్టు తరహా తనిఖీలు చేసి పర్యాటకులను క్రూయిజ్‌లోకి అనుమతిస్తున్నారు. 


పర్యాటకంగా విశాఖ మరో అడుగు 

క్రూయిజ్‌ రాకతో విశాఖ పర్యాటకంగా మరో అడుగు ముందుకేసినట్టయింది. ఈ విలాసవంతమైన నౌక రాకతో విశాఖలో పర్యాటక సందడి మరింత పెరిగే అవకాశముంది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖవాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖకు వస్తారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో విశాఖ నుంచి విదేశాలకు క్రూయిజ్‌ విహార యాత్రకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.  

నెరవేరిన కల 
చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రూయిజ్‌ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల కల నెరవేరినట్టయింది. విశాఖ వాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్‌ విహార యాత్రకు పోటీ పడ్డారు. తొలి సర్వీసుకు పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరో సర్వీసుకు 90 శాతం టికెట్ల విక్రయాలు జరగగా.. 22వ తేదీకి పూర్తిస్థాయిలో ఫుల్‌ అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే జూలై, ఆగస్టు, సెపె్టంబర్‌ మాసాల్లో సర్వీసులకు అప్పుడే 60 శాతం టికెట్లు అమ్ముడైనట్లు తెలిపారు.
Technical Details Of Cordelia Cruise Ship

మూవింగ్‌ స్టార్‌ హోటల్‌ 
కార్డీలియా క్రూయిజ్‌ ఒక మూవింగ్‌ స్టార్‌ హోటల్‌. మొట్టమొదటిసారిగా విలాసవంతమైన క్రూయిజ్‌లో విహారయాత్ర సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ అన్ని సదుపాయాలు, సౌకర్యాలను బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా, విలాసవంతంగా గడిపే మంచి యాత్ర ఇది. 
– జయకర్, విశాఖపట్నం

క్రూయిజ్‌లో సదుపాయాలు 
► కార్డీలియా ఎంప్రెస్‌ క్రూయిజ్‌ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. 
► మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్‌ మొదటి ఫ్లోర్‌లో ఇంజిన్, రెండో ఫ్లోర్‌లో కార్గో ఉంటుంది. 
► మూడో ఫ్లోర్‌ నుంచి పాసింజర్‌ లాంజ్‌ మొదలవుతుంది.  
► అక్కడి నుంచి ఎలివేటర్‌ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. 

► పదో ఫ్లోర్‌లో డెక్‌ లాంటి పెద్ద టెర్రస్‌ ఉంటుంది. 
► పదకొండో అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్‌ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. 
► లగ్జిరీ సూట్‌(8వ ఫ్లోర్‌) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్‌ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. 
► ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్‌ అందుబాటులో ఉన్నాయి. 

► చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డీలియా కిడ్స్‌ అకాడమీ పేరితో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 

► జిమ్, ఫిట్‌నెస్‌ సెంటర్, స్విమ్మింగ్‌ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్‌ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్‌ క్లబ్, 24 గంటల సూపర్‌ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్‌ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 

► డీజే ఎంటర్‌టైన్మెంట్, లైవ్‌ బ్యాండ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. 
► అడ్వెంచర్‌ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్‌ షోలు కూడా అలరిస్తాయి. 
► టికెట్‌ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. 
► లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

క్యాసినో ఆడాలంటే.. 
రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు