ప్చ్‌.. ముహూర్తం బాగాలేదు..

24 Apr, 2021 10:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శుభకార్యక్రమాలపై కరోనా ప్రభావం

గతేడాది మాదిరిగానే అంతరాయం

మే, జూన్‌లలో అధిక ముహూర్తాలు

ఇప్పటికే భారీగా అడ్వాన్సు చెల్లింపు

వధూవరుల తల్లిదండ్రుల ఆందోళన

రామచంద్రపురం: పెళ్లిళ్లపై మళ్లీ కరోనా ప్రభావం పడుతోంది. రానున్న రెండు నెలల్లో బాజాబజంత్రీలు వినిపించడంపై సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాది చివరి నుంచి దాదాపు మూఢం వలన ముహూర్తాలు లేవు. మే 1న మూఢం నిష్క్రమిస్తుందని ఆశ పడుతుంటే కోవిడ్‌–19 అశనిపాతంలా ఎదురైంది. దీంతో శుభ కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం తలెత్తుతోంది. గృహ ప్రవేశాలు చేయాలనుకునేవారు.. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారి గుండెల్లో రాయి పడింది. వీరందరూ ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకుని కొంత సొమ్ము వెచ్చించేశారు. ఇప్పుడేం చేయాలో వారికి పాలు పోవడం లేదు. కరోనా వైరస్‌ విజృంభణ వల్ల ఒకటి రెండు నెలలు అంతరాయం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మే, జూన్‌ నెలల్లో దివ్యమైన ముహూర్తాలు
ఏటా మే, జూన్‌ నెలలు పెళ్లిళ్ల సీజను. ఈ రెండు నెలల్లో దివ్యమైన ముహూర్తాలు కుదరటంతో చాలామంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. మే 2 నుంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. 3, 4, 6, 8 తేదీల్లో ఎక్కువగా పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. 12 నుంచి 30వ తేదీ వరకూ మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. 13, 31 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంటున్నారు. జూన్‌

1 నుంచి 13 వరకూ కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే నిశ్చితార్థాలు పూర్తి చేసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు.
గత ఏడాది మార్చి నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అక్టోబర్‌ వరకూ పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు జరగలేదు.
తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా ప్రభుత్వ అనుమతి పొంది, పరిమిత సంఖ్యలోనే హాజరై మొక్కుబడిగా నిర్వహించారు.
ఈ ఏడాది ఆరంభంలో చేయాలనుకున్నా  మూఢం ఎదురైంది. దీంతో మే, జూన్‌ నెలల్లో వివాహాలు చేసేందుకు ఎక్కువమంది ఏర్పాట్లు చేసుకున్నారు.
సుమారు ఆరు వేల పెళ్లిళ్ల కోసం 2 వేల కల్యాణ మంటపాలకు అడ్వాన్సు చెల్లించి, బుక్‌ చేసుకున్నారని అంచనా.
విద్యుద్దీపాలంకరణకు, భారీ సెట్టింగులు, కేటరింగ్, పురోహితులకు, బ్యాండు మేళాలకు జనవరి నెలలోనే అడ్వాన్సులిచ్చేశారు. సుమారు ఆరు వేల పెళ్లిళ్లకు రూ.10 కోట్లు పైగానే ఖర్చవుతుందని భావిస్తున్నారు.
అన్నవరం, ద్రాక్షారామ, సామర్లకోట దేవస్థానాల్లో అత్యధికంగా పెళ్లిళ్లు చేసేందుకు కల్యాణ మంటపాలు, గదులు బుక్‌ అయ్యాయని ఆలయ వర్గాలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో వెయ్యికి పైగా పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు.

కలవరపెడుతున్న కరోనా
తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక  కొద్ది రోజులుగా కరోనా సెకండ్‌ వేవ్‌ తుపానులా విరుచుకుపడుతోంది. అధిక సంఖ్యలో కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. జనం కూడా పది మంది ఉన్నచోటకు వెళ్లడం లేదు. దీంతో పెళ్లిళ్ల నిర్వహణ డోలాయమానంలో పడింది. కల్యాణ మంటపాల్లో చేసేందుకు అధికారులు అనుమతించే పరిస్థితి లేదు. తెగించి చేసినా బంధువులు, స్నేహితులు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో మళ్లీ ఎన్నాళ్లు ఎదురు చూడాలో అని వధూవరుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నారు 
ఈ ఏడాదైనా పెళ్లిళ్ల సీజన్‌లో కేటరింగ్‌ ఎక్కువగా ఉంటుందనుకున్నాం. మే, జూన్‌లలో కేటరింగ్‌ కుదుర్చుకున్న వారు ఆ సంఖ్యను రద్దు చేసుకుంటున్నారు. వెయ్యి మందికి వడ్డన పురమాయించుకున్నవారు వంద మందికి కుదించుకుంటున్నారు. 
–  పెట్టా శంకరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా కుకింగ్, కేటరింగ్‌ అసోసియేషన్, ద్రాక్షారామ 

ఏం చేయాలో పాలుపోవటం లేదు
మా అబ్బాయి పెళ్లి మే 21న నిర్ణయించుకున్నాం. కరోనా భయంతో ఏం చేయాలో పాలు పోవటం లేదు. బంధువులు ఎక్కువ. ప్రభుత్వం వంద మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేలా లేదు. చాలా బాధగా ఉంది.
– నామాల పల్లాలమ్మ, పెంకులపాటి గరువు, రావులపాలెం మండలం 

మే నెలంతా బుక్‌ చేసుకున్నారు
మే నెలంతా ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసుకున్నారు. వంద మంది కన్నా ఎక్కువ ఉండరాదంటున్నారు. పెళ్లిళ్లు చేసుకునే వారు ఏం చేయాలో తెలియక వచ్చి వెళుతున్నారు. గత ఏడాది కూడా ఇలానే జరిగింది. ఈసారీ మా పరిస్థితి బాగాలేదు.
– కొండ్రెడ్డి లక్ష్మణరావు, వినయ్‌ దుర్గ ఫంక్షన్‌ హాల్‌ అధినేత, రామచంద్రపురం

చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..
వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే..

మరిన్ని వార్తలు