పోలవరం గేట్ల ఏర్పాటుకు కరోనా దెబ్బ! 

16 May, 2021 04:10 IST|Sakshi

కరోనా ప్రభావం వల్ల జర్మనీలో సుదీర్ఘ లాక్‌డౌన్‌ 

దాంతో 12 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్ల దిగుమతిలో జాప్యం 

ఆరు గేట్ల పనులకు ఆటంకం 

వాటిని అమర్చి పైకి ఎత్తేసి ఉంచాలని నిర్ణయం 

ఇప్పటికే 42 గేట్లను అమర్చడంతోపాటు వాటికి 84 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లు బిగింపు 

పది రివర్‌ స్లూయిజ్‌ గేట్ల పనులూ పూర్తి 

గోదావరికి వరద వచ్చేలోగా స్పిల్‌ వే సిద్ధం 

ఈ సీజన్‌లో స్పిల్‌ వే మీదుగానే వరద మళ్లింపు 

సాక్షి, అమరావతి:  పోలవరం ప్రాజెక్టు గేట్ల పనులకు కరోనా మహమ్మారి ఆటంకం కల్పిస్తోంది. గేట్లను పైకి ఎత్తడానికి, కిందకు దించడానికి అవసరమైన హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను జర్మనీలోని మాంట్‌ హైడ్రాలిక్‌ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. కరోనా ప్రభావం వల్ల జర్మనీలో సుదీర్ఘ కాలంగా లాక్‌ డౌన్‌ అమల్లో ఉంది. దీని వల్ల 12 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్ల దిగుమతిలో జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆరు గేట్లను అమర్చి.. వాటిని పైకి ఎత్తేసి ఉంచాలని జల వనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. జూన్‌ తర్వాత 12 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లు జర్మనీ నుంచి వస్తాయని.. వాటిని ఆరు గేట్లకు బిగిస్తామని ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. స్పిల్‌ వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని.. ఈ సీజన్‌లో వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లిస్తామని చెప్పారు.
  
అప్రోచ్‌ చానల్‌ పనులు వేగవంతం 
► గోదావరి నది చరిత్రలో ధవళేశ్వరం బ్యారేజీలోకి 1986 ఆగస్టు 16న గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. జలాశయం భద్రత దృష్ట్యా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా సులభంగా దిగువకు వదిలేలా పోలవరం స్పిల్‌ వేను నిర్మించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.  
► సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు 1,128.40 మీటర్ల పొడవు, 55 మీటర్ల ఎత్తుతో స్పిల్‌ వేను నిర్మిస్తున్నారు. స్పిల్‌ వేకు 20 మీటర్ల ఎత్తు.. 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను బిగించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 42 గేట్లను అమర్చింది. 

వాటిని పైకి ఎత్తడానికి, దించడానికి 
వీలుగా 84 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను బిగించి.. పవర్‌ ప్యాక్‌లను అమర్చి.. వాటిని కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానం చేసింది. మిగతా ఆరు గేట్లను అమర్చే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. నెలాఖరులోగా వాటిని అమర్చి.. మిగతా గేట్లతోపాటు ఈ ఆరు గేట్లను పైకి ఎత్తేసి ఉంచనున్నారు. 
► స్పిల్‌ వేకు పది రివర్‌ స్లూయిజ్‌ గేట్లను ఇప్పటికే బిగించారు. గోదావరికి వరద వచ్చేలోగా.. వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే వైపు మళ్లించేలా అప్రోచ్‌ చానల్‌ను పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేశారు. ఆలోగా స్పిల్‌ చానల్‌ను పూర్తి చేయనున్నారు. ఈ సీజన్‌లో గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. వరద సమయంలోనూ ప్రధాన డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) పనులను చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు